- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కుటుంబానికి వేలిముద్రలు లేవు
దిశ, వెబ్‌డెస్క్: పుట్టినప్పుడు ఏర్పడే వేలి ముద్రలు చనిపోయే దాకా మారనట్లే.. మన బాడీలోని ఏ రెండు వేళ్ళకు కూడా ఒకే ముద్ర ఉండదు. అంతేకాదు ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు కూడా ఒకేలా ఉండవు. అందుకే దొంగలను, నేరస్తులను ట్రేస్ చేయడానికి ‘వేలిముద్రల’ను ఉపయోగిస్తారు. ఆధార్ కార్డు కావాలన్నా, పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేయాలన్నా, చివరకు స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ లాక్ ఓపెన్ చేయాలన్నా ‘వేలిముద్రలు’ తప్పనిసరి. మరి వేలిముద్రలు లేకపోతే ఏంటి? అలాంటి వారు కూడా ఉంటారా? అంటే ఉంటారు. ఒక అరుదైన జన్యుపరివర్తన (జెనెటిక్ మ్యూటేషన్) కారణంగా కొంతమంది చేతి వేళ్లపై డెర్మటాగ్లిఫ్స్(వేలిముద్రలు) ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉన్నవారు చాలా కొద్దిమందే ఉండగా, అందులో బంగ్లాదేశ్‌కు చెందిన అపు సర్కార్ కుటుంబం ఒకటి. ఆ కుటుంబంలో పురుషులెవరికీ వేలిముద్రలుండకపోవడం విశేషం.
బంగ్లాదేశ్, రాజ్‌షాహి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జీవించే అపు సర్కార్.. మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా అతని కుటుంబం ‘అడెర్మటాగ్లిఫియా’ అనే డిసీజ్‌తో ఇబ్బంది పడుతోంది. ఈ సమస్య వల్ల తన తాత, నాన్న, పెదనాన్నకు కూడా వేలిముద్రలు లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం 2008లో వయోజనులందరికీ నేషనల్ ఐడీ కార్డులను ప్రవేశపెట్టగా, అపు వాళ్ల నాన్న అమల్ సర్కార్‌కు వేలి ముద్రలు లేకపోవడంతో కార్డు మీద ‘నో ఫింగర్ ప్రింట్’ అని రాసిచ్చారు. ఇక ఆయన పాస్‌పోర్ట్ సైతం ఒక మెడికల్ సర్టిఫికెట్ సాయంతో పొందగలిగారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ వేలిముద్రల సమస్య వస్తుందన్న భయంతో ఇంతవరకు ఎప్పుడూ విమానంలో ప్రయాణించనేలేదు. డ్రైవింగ్ వచ్చినా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం రాలేదు. దాంతో పోలీసులు పట్టుకున్న ప్రతిసారి ఫైన్ కడుతున్నాడు. ఆఖరికి సిమ్ కార్డు కూడా తమ కుటుంబంలోని మహిళల పేరు మీదనే తీసుకున్నారు.
అపు కుటుంబానికి వచ్చిన ఈ సమస్యను ‘అడెర్మటాగ్లిఫియా’ అంటారు. దీన్నే ‘ఇమిగ్రేషన్ డిలే డిసీజ్’ అని కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళకు వేలిముద్రలు లేని కారణంగా ఆపడంతో దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ డిసీజ్ ఒక కుటుంబంలో కొన్ని తరాల వరకు సంక్రమించే అవకాశం ఉంది. ఇక అపు కుటుంబానికి వచ్చిన ఈ సమస్యను పుట్టుకతో వచ్చిన ‘పామోప్లాంటర్ కెరటోడెర్మా’గా గుర్తించగా, ఇది అడెర్మటాగ్లిఫియా అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక డెర్మటాలజిస్ట్ తెలిపారు. ఈ వ్యాధి కారణంగా చర్మం పొడిబారడం, అరచేతులు, అరికాళ్లల్లో చెమట పట్టకపోవడం జరుగుతుంది. అపు కుటుంబానికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వారి సమస్య ఏమిటో కచ్చితంగా నిర్ధారించవచ్చుగానీ దానిని తగ్గించే పరిష్కార మార్గమేమీ లేదని ఆయన అంటున్నాడు.
‘ఇది నా చేతుల్లో ఉన్నది కాదు. పుట్టుకతో వచ్చింది. దీనివల్ల నా పిల్లలు, నేను అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇది చాలా బాధాకరం’ అని అమల్ చెప్పారు. కాగా అమల్, అపుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నేషనల్ ఐడెంటిటీ కార్డ్ జారీ చేసింది. ఇందులో ఇతర బయోమెట్రిక్ డేటా, కంటి రెటీనా స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్‌లను పొందుపరిచారు.