- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్తవ్యస్తంగా తెలంగాణ విద్యా వ్యవస్థ..!
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు అవసరమైన మేర ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించకపోవడం.. వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో.. పాఠశాల విద్య ఏటేటా తన ఉనికిని కోల్పోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీని మరిచినట్టున్నారు. పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరు, ఉన్న సమస్యలను సీఎంకు వివరించే సాహసం చేసే వారు లేక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఆరు నెలల్లో గురుకులాలు, కేజీబీవీల బలోపేతం నిర్ణయాలు మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిర్ణయాలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలల వివరాలు..
రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల విభాగాల్లో మొత్తం 40, 901 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ లోకల్ బాడీ పాఠశాలలు 26, 065 ఉన్నాయి. మిగతావి గురుకులాలు, వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్నవి. వీటన్నింటిలో 60 లక్షల మంది విద్యార్థులకు పైగా విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది బీద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మిగతావారు గురుకులాలు, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడక్కడ మినహాయిస్తే పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. సరైన వసతులు లేక, చెప్పే ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి.
ఒక్క నిర్ణయం తీసుకుంటే ఒట్టు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిస్థాయిలో బలోపేతమవుతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే సీఎం కేసీఆర్ హామీలు కూడా గుప్పించారు. ఉన్న సంక్షేమ హాస్టళ్లతో పాటు కొన్ని గురుకులాల ఏర్పాటు చేయడం, కేజీబీవీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం మినహాయిస్తే ఇతర ముఖ్య విషయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు. ఉపాధ్యాయుల పదోన్నతులు, ఇతర ముఖ్యమైన పోస్టుల భర్తీ ఆగిపోయాయి.
ఖాళీల వివరాలు..
రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో 12 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈవో లు ఉన్నారు. మిగతా జిల్లాల్లో డైట్, బీఈడీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 591 ఎంఈఓ పోస్టులకుగాను కేవలం 18 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగతా మండలాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లు గా కొనసాగుతున్నారు. 5418 ఉన్నత పాఠశాలలో 3200 పాఠశాలల్లో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు ఉండగా 2218 పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం 25 వేల మందికి పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అంచనా. ఉపాధ్యాయ ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించుకొని తూతూమంత్రంగా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.
ఎవరూ సాహసించడం లేదు..
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే సమస్యలను పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు అటు ప్రభుత్వ అధికారులు గానీ, ఇటు మంత్రులు గానీ ముందుకు రాకపోవడంతో విద్యా వ్యవస్థ గందరగోళంగా తయారవుతోంది. మరోవైపు ఉపాధ్యాయ నియామక ప్రక్రియలను చేపట్టకపోవడం, ఐదేళ్ల నుండి ఉన్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు నిరుద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వీడాలి..
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వీడాలి. ఐదు సంవత్సరాలుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఉన్న హోదాల్లోనే పదవీ విరమణ చేశారు. బదిలీలు లేక ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కాక విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
-చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.
సీఎం దృష్టికి తీసుకెళ్లే వారేరి..?
విద్య, ఉపాధ్యాయ సమస్యలను గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు గాని, మంత్రులు, ఎమ్మెల్సీలు సాహసం చేయడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్లు రాల్చుకునేందుకు రైతుబంధు, పింఛన్ల వంటి పథకాలపై దృష్టిసారిస్తున్నారు కానీ.. ఓట్లు వేయలేని విద్యార్థుల గురించి గానీ, ఉపాధ్యాయుల సమస్యలను గానీ పట్టించుకోక పోవడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.
– జి. హర్షవర్ధన్ రెడ్డి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు