డీఎంకేదే పీఠం..!

by Shamantha N |
 డీఎంకేదే పీఠం..!
X

చెన్నై : తమిళనాడులో వరుసగా రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న ద్రావిడ మున్నెట్ర కజగం (డీఎంకే) ఈసారి భారీ విజయం దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఆ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. 234 స్థానాలున్న రాష్ట్రంలో అధికార పీఠం చేపట్టాలంటే 118 సీట్లు సాధించాల్సి ఉండగా.. డీఎంకే ఇప్పటికే 140 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార అన్నాడీఎంకే (ఎఐఎడీఎంకే) 92 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. గతేడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయం దిశగా సాగుతున్నది. కాంగ్రెస్, లెఫ్ట్ తో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న డీఎంకే అధికార పీఠం అధిరోహించడం పక్కాగా కనిపిస్తున్నది.

ఓడుతున్న మంత్రులు..

రెండు పర్యాయాలు అధికారంలో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. ఇప్పటివరకు వస్తున్న ఫలితాల ప్రకారం.. జయకుమార్, ఎం.సి. సంపత్, ఓఎస్ మనియన్, పాండ్యరాజన్, వలర్‌మతి లు ఓటమి దిశగా సాగుతున్నారు.

బీజేపీ ప్రభావం అంతంతే..

ఎఐఎడీఎంకేను ముందు నిలిపి తమిళనాట కాలు మోపాలన్న కమలనాథుల కలలు కల్లలుగానే మిగిలేలా ఉన్నాయి. అధికార పార్టీతో పొత్తు పెట్టుకుని సుమారు 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. థౌజండ్ లైట్స్ నుంచి పోటీలో ఉన్న నటి ఖుష్బూ సుందర్ తన సమీప ప్రత్యర్థి కంటే 2 వేల ఓట్లు వెనుకంజలో ఉన్నారు.

కమలహాసన్ ఒక్కడే..

మక్కల్ నీది మయ్యయ్ (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ కోయంబత్తూరు స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ స్థానం మినహా అన్ని సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. టీటీవి దినకరన్ కూడా ఓటమి దిశగా సాగుతుండటం గమనార్హం.
ఎన్నికల ఫలితాలు డీఎంకే విజయం ఖాయం అని సూచిస్తుండటంతో డీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఆఫీసుల ముందు కార్యకర్తలు బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. స్టాలిన్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పెద్దఎత్తున కార్యకర్తలు గుమిగూడటంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పలువురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed