ఒకేరోజు పదిలక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తాం..

by sudharani |
ఒకేరోజు పదిలక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తాం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా 24 గంటల వ్యవధిలోనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ చేశామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన 24 గంటల వ్యవధిలోనే పది లక్షల మందికి ఇవ్వగలుగుతామని, రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాజధాని నుంచి రిమోట్ గ్రామం వరకు టీకాలను ఇవ్వడానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినా త్వరలోనే వైద్య సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతలను ప్రభుత్వం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను అప్పజెప్పిన నేపథ్యంలో దీని వినియోగంపై ‘దిశ’కు వివరించారు.

మన రాష్ట్రానికి మాత్రమే కాక మొత్తం దేశానికే వ్యాక్సిన్ పంపిణీని పకడ్బందీగా అమలు చేయడంలో పూర్వానుభవం ఉందని, తగిన ఏర్పాట్లూ ఉన్నాయని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో పెద్దగా హైరానా పడాల్సిన అవసరమేం లేదన్నారు. జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, కేంద్రం నుంచి అందిన వెంటనే ప్రాధాన్యతాక్రమంలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తొలుత వైద్యారోగ్య సిబ్బంది, ఆ తర్వాత రక్షణ శాఖ-పోలీసులు, ఆ తర్వాత 50ఏండ్ల వయసుపైబడినవారు, ఆ తర్వాత వయసుతో సంబంధం లేకుండా వివిధ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి అందిస్తామన్నారు.

ఇప్పటికే సుమారు 2.75 లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది వివరాలను ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచామని, మిగిలినవారి వివరాలను వివిధ ప్లాట్‌ఫారంల నుంచి సేకరిస్తున్నామని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అనుకున్న లక్ష్యం ప్రకారం 80 లక్షల మందికి తలా రెండు డోస్‌ల చొప్పున ఇవ్వడానికి కేంద్రం నుంచి 1.6 లక్షల డోస్‌లు వస్తాయన్నారు. ఈ ప్రకారం రాష్ట్ర జనాభాలో దాదాపు ఇరవై శాతానికంటే ఎక్కువ మందికే వ్యాక్సిన్ అందుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ నిర్బంధంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న షరతు లేదని నొక్కిచెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కు మాత్రం వాడడం అన్ని విధాలా శ్రేయస్కరమన్నారు.

మన రాష్ట్రంలో సుమారు పాతిక వేల మంది ‘ఆశా’ వర్కర్లు ఉన్నారని, ఒక్కక్కరూ కనీసం 250 కుటుంబాలను చూస్తున్నారని, సగటున వెయ్యి మంది చొప్పున పర్యవేక్షిస్తున్నారని, ఇప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్‌ను వారి ద్వారా ఇప్పించడానికి పెద్దగా ఇబ్బంది లేదన్నారు. వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి ముందు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ట్రెయినర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ ఇస్తుందని, ఆ ట్రెయినర్లు గ్రామీణ స్థాయి వరకు పలు దఫాలుగా శిక్షణ ఇస్తారని వివరించారు. రెండు వారాలుగా మన రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

కోల్డ్ స్టోరేజీ అతి పెద్ద సమస్య

మన దేశంలో తయారయ్యే చాలా వ్యాక్సిన్‌లు మైనస్ రెండు నుంచి మైనస్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేసేవని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ సైతం అదే స్థాయిలో ఉండొచ్చని, అదనంగా ఏర్పాట్లు అవీ అవసరం లేకపోయినా వారం రోజుల వ్యవధిలోనే 80 లక్షల మందికి ఇవ్వాలి కాబట్టి కోల్డ్ స్టోరేజీ వ్యవస్థను మాత్రం సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల దగ్గర నిల్వ చేయాలనే వార్తలు వస్తున్నాయిగానీ, తయారుచేస్తున్నది మన దేశానికే చెందిన భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ కాబట్టి ఇక్కడి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తాయన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి నగరంలో కోల్డ్ స్టోరేజీ వ్యవస్థను, టీకాలకు వాడే సిరంజీల నిల్వ కోసం మరో వ్యవస్థను నెలకొల్పుతున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాజధాని నుంచి రిమోట్ గ్రామాలకు చేరవేయడానికి వాకింగ్ కూలర్ పేరుతో ప్రత్యేక వాహనాలను, బాక్సులను వాడనున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో మామూలు వ్యాక్సిన్‌లను నిల్వ చేయడానికి వాడుతున్న కూలర్ బాక్సులకు అదనంగా కొత్తవి కూడా సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో 20 వేల చ.అ. ప్రత్యేక గోడౌన్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇక లబ్ధిదారుల విషయంలో కేంద్రం రూపొందించిన ‘కొవిన్’ సాప్ట్‌వేర్‌లోని డాటా ప్రకారం నిర్దిష్టంగా ఏ బూత్‌లో, ఏ తేదీన, ఏ సమయంలో తీసుకోవాలో మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెళ్తుందన్నారు. ఆ ప్రకారం వారికి తొలి డోస్‌ను ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూనే 45 రోజుల తర్వాత మరో డోస్ ఇస్తామని, అప్పటినుంచి దాని ప్రభావం మన శరీరంలో కనిపిస్తుందన్నారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్టు వచ్చిందో తెలుసుకోడానికి మాత్రం ఆరు నెలల సమయం పడుతుందన్నారు. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నట్లయితే ప్రభుత్వం త్వరలోనే ఒక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తుందని, దాంట్లో వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనవరి రెండవ వారం నుంచి వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుందని తమ అంచనా అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed