ఆ సంస్కృతి తమిళులది కాదు : కాంగ్రెస్

by Shamantha N |
ఆ సంస్కృతి తమిళులది కాదు : కాంగ్రెస్
X

చెన్నై: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై కేవలం న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుందని, ఇతర పార్టీలు వారి విడుదలను డిమాండ్ చేయడం సరికాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తెలిపింది. రాజీవ్ హంతకులను విడుదల చేస్తే 25 ఏళ్లకు పైగా జైళ్లో ఉంటున్న దోషులనూ విడుదల చేయాలన్న డిమాండ్లు వస్తాయని కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్యలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురినీ విడుదల చేయాలని న్యాయస్థానం నిర్ణయిస్తే తాము అంగీకరిస్తామని, కానీ, రాజకీయపార్టీలు ఈ డిమాండ్ చేయడం సమంజసం కాదని తెలిపారు.

హత్యకు పాల్పడ్డవారిని హంతకులుగానే చూడాలని, తమిళులుగా చూడరాదని సూచించారు. ఒకవేళ హంతకులను విడుదల చేయాలన్న ఉద్యమాన్ని మొదలుపెడితే, పోలీసుస్టేషన్లు, కోర్టులు, శాంతి భద్రతలపై వ్యాఖ్యలన్నీ నిరర్థకమని వివరించారు. మాజీ ప్రధానిని చంపిన హంతకులకు మద్దతునిచ్చే సంస్కృతి తమిళులది కాదని పేర్కొన్నారు. రాజీవ్ కేసులో దోషులు నళిని, టీవీఎల్ శ్రీహరణ్ అలియాస్ మురుగన్, సంథాన్, ఏజీ పెరారివలన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్‌‌లను జైలు శిక్షను తగ్గించే అభ్యర్థనలను పరిశీలించాలని గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే కోరిన కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed