Twitter India : మా చట్టాలను పాటించాల్సిందే.. ట్విట్టర్ కేంద్రం వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-05-27 11:09:23.0  )
Twitter India : మా చట్టాలను పాటించాల్సిందే.. ట్విట్టర్ కేంద్రం వార్నింగ్
X

న్యూఢిల్లీ: వివాదాస్పద ‘టూల్ కిట్’ వ్యవహారంలో ఢిల్లీ, గుర్గావ్‌లోని ట్విట్టర్ ఇండియా కార్యాలయాలకు పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్లిన తరుణంలో భారత్‌లో తమ సిబ్బంది భద్రతపై ఆందోళన చెందుతున్నట్టు మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ గురువారం తెలిపింది. ‘ప్రస్తుతం మేం భారత్‌లోని మా సిబ్బంది సేఫ్టీపై ఆందోళనలో ఉన్నాం. అలాగే, మేం సేవలందిస్తు్న్న భారతీయుల భావ ప్రకటన స్వేచ్ఛకు పెను ముప్పుపట్లా కలత చెందుతున్నాం’ అని వివరించింది. సంస్థ అంతర్జాతీయ విధానాలపట్ల భయాందోళనలు కల్పించే వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 26న అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌పై స్పందిస్తూ ఇండియాలోని చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. ప్రభుత్వంతోనూ నిర్మాణాత్మక చర్చ జరుపుతామని వివరించింది. ఈ చట్టాలను అమలు చేయడానికి తమకు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని కోరింది. ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌కు కంప్లయెన్స్ అధికారే బాధ్యత వహించాలన్నట్టుగా ఉన్నదని పేర్కొంది.

ట్విట్టర్ అనవసరంగా రాద్దాంతం చేయకుండా కొత్త ఐటీ చట్టాలను పాటించాలని కేంద్రం ఘాటుగా స్పందించింది. కాగా, వాక్‌స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక విలువలను శతాబ్దాలుగా భారత్ పాటిస్తున్నదని కేంద్రం తెలిపింది. ఇండియాలో వీటిని కాపాడే ప్రత్యేక హక్కు లాభార్జన కోసం, విదేశీ, ప్రైవేటు సంస్థ ట్విట్టర్‌కే ఉన్నదనుకోవద్దని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొంది. ఇండియాలోని చట్టాలను అమలు చేయాలని, ధిక్కారానికి పోవద్దని స్పష్టం చేసింది. ట్విట్టర్ కేవలం ఒక సోషల్ మీడియా సంస్థ అని, భారత లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో దాని జోక్యమేమీ ఉండదని వివరించింది.

కొత్త చట్టాల అమలుపై 15 రోజుల్లో వివరాలివ్వండి

కొత్త ఐటీ చట్టాలను అమలు చేయడంపై 15 రోజుల్లో వివరాలు అందజేయాలని ఓటీటీ, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ సహా డిజిటల్ మీడియా పబ్లిషర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్ న్యూస్, డిజిటల్ మీడియా సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లకు కోడ ఆఫ్ ఎథిక్స్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ఫేక్ న్యూస్ కట్టడి కోసమే సోషల్ మీడియా, స్ట్రీమింగ్ కంపెనీలపై నియంత్రణ చట్టాలను చేశామని వివరించారు.

Advertisement

Next Story