కలకలం: ఒంటినిండా గాయాలతో కారులో మృతదేహం

by Sumithra |
Vijaya Bhaskar Reddy
X

దిశ, కంటోన్మెంట్: మేడ్చల్ జిల్లా తిరుమలగిరి పెద్ద కమేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో కారులో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మరణించాడు. మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అల్వాల్‌కి చెందిన విజయ భాస్కర్ రెడ్డి (50)గా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సాయంతో మరణించిన వ్యక్తి నుండి ఆధారాలు సేకరించారు. అయితే, అల్వాల్ ప్రాంతానికి చెందిన విజయ భాస్కర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి విగతజీవిగా మారడం కలకలం రేపుతోంది.

నోరు, ముక్కు వద్ద తీవ్ర గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. అతను చనిపోవడానికి ఆస్తి తగాదాలే కారణమా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయ భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story