తెలంగాణలో వ్యవసాయ పండుగ

by Shyam |   ( Updated:2020-08-05 12:13:40.0  )
తెలంగాణలో వ్యవసాయ పండుగ
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పండుగ నెలకొంది. సాధారణ సాగును మించి రైతులు పంటలు వేశారు. ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఈసారి పత్తి, వరి సాగు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటు సాగు 110 శాతంగా నమోదైంది. మొత్తం 1,13,43,920 ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. వానాకాలం సాధారణ సాగు 1.03 కోట్ల ఎకరాలు కాగా ప్రభుత్వం ఈసారి 1.25కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. అంచనాకు తగ్గట్టే రైతులు పంటలు వేశారు. పత్తి, వరి, కంది పంటలు సాధారణసాగును దాటిపోయాయి. ప్రభుత్వం అనుకున్నదానికంటే ఎక్కువగా సాగుచేశారు. సగటు సాగు 110 శాతంగా నమోదు కాగా పలుజిల్లాలో 135శాతంతో పంటలు సాగు చేసిన రికార్డు సాధించాయి.

అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 135, వికారాబాద్ జిల్లాలో 132 శాతం పంటలు సాగు చేశారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, ములుగు, ఖమ్మం, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలో సగటు సాగులో 90 నుంచి 98 శాతం వరకు ఉండగా, మిగిలిన జిల్లాలన్నీ 100 నుంచి 130 శాతం వరకు పంటలు వేశారు.
గత ఏడాది ఇదే వానాకాలంలో ఇప్పటివరకు మొత్తం పంటలు 76.07 లక్షల ఎకరాల్లో వేస్తే ఈసారి మాత్రం 1.13కోట్ల ఎకరాలకు చేరింది. ప్రాజెక్టుల కింద వరద కొనసాగుతుండటం, కొన్నిచోట్ల ఇప్పుడే వరద వస్తుండటంతో మరింత సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వరిసాగు గత ఏడాది 9.24లక్షల ఎకరాల్లో మాత్రమే ఉండగా ఈసారి 38.35 లక్షల ఎకరాలు, పత్తిసాగు గతేడాది 43.46లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు 56.26 లక్షల ఎకరాలకు పెరిగింది. కంది కూడా ఈసారి 9.54 లక్షల ఎకరాల్లో వేశారు. ఇక మొక్కజొన్న సాగును ప్రభుత్వం పూర్తిగా వేయరాదని ప్రకటించింది. కానీ బుధవారం లెక్కల ప్రకారం 1.74 లక్షల ఎకరాల్లో సాగైంది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 15జిల్లాలో బుధవారం నాటికి ఎక్సెస్ వర్షపాతం నమోదు కాగా, 16జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా వర్షం కురిసింది.

పంట గతేడాది సాగు ప్రస్తుతం సాగు ( బుధవారం వరకు )
వరి 9,24,399 38,35,088
మొక్కజొన్న 8,33,849 1,74,773
కంది 6,43,683 9,54,061
మొత్తం పప్పు ధాన్యాలు 8,40,938 11,38,504
ఆహార ధాన్యాలు 26,97,541 52,43,666
ఆయిల్ సీడ్స్ 5,01,423 4,20,715
మొత్తం పంటలు 76,07,828 1,13,43,920
Advertisement

Next Story

Most Viewed