- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చెప్పినా వినడం లేదు
దిశ, తెలంగాణ బ్యూరో: పాలనలో కీలకమైన రెవెన్యూ శాఖపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రక్షాళన పేరిట అమల్లోకి తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నా, వాటిని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు మాత్రం మార్గాలను మూసేస్తున్నారు. ఉద్యోగుల పదోన్నతులు, వీఆర్వో వ్యవస్థ రద్దు, వీఆర్ఏలకు పే స్కేలు వంటి అనేక హామీలను సీఎం కేసీఆర్ ఇచ్చి 90 రోజులైంది. అన్నీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. కానీ చీఫ్ సెక్రటరీతో పాటు సీఎంఓ అధికారులందరూ సీఎం ఆదేశాలను అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
సెప్టెంబరు 12వ తేదీన రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. మెరుగైన ధరణి పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యం కలిగిన ఉద్యోగులను ప్రశంసించారు. అప్పుడే సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. అక్కడే చీఫ్ సెక్రటరీకి సంబంధిత ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడేమో ఆ నాయకులకు సీఎస్ అపాయింట్మెంట్ దొరకడం లేదు. దాంతో కింది స్థాయి ఉద్యోగులంతా ఉద్యోగ సంఘ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్ర అవరోధాలు కలుగుతున్నట్లు ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు.
నిలిచిన పదోన్నతులు..
జూనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. 50 మంది డిప్యూటీ కలెక్టర్లు, 90 నుంచి 100 మంది తహసీల్దార్లు, 250 నుంచి 300 మంది వరకు డిప్యూటీ తహసీల్దార్లు.. ఇంకా పెద్ద సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతుల అర్హత జాబితాలో ఉన్నారు. మూడు నెలల క్రితమే చేయాల్సిన ప్రక్రియను ఇప్పటికీ పెండింగులోనే ఉంచారు. అలాగే తెలంగాణలో వీఆర్వో పోస్టులను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలు, లేదా అదే రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేస్తామని సీఎం పలుమార్లు ప్రకటించారు. నిండు అసెంబ్లీలోనూ హామీ ఇచ్చారు. అదే దారిలో వారి జాబితాలను రూపొందించారు. కానీ ఇప్పటికీ వారంతా తహసీల్దార్ కార్యాలయాల్లోనే అదే పోస్టుల్లో కొనసాగుతున్నారు. తహసీల్దార్ల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు మళ్లీ అదే భూ సంబంధ వ్యవహారాలను చేపట్టి ఎమ్మెల్యేలతో బండ బూతులు తిన్న సందర్భాలూ ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలు సేకరించడం, వారి పాస్‌పోర్టులను పరిశీలించడం వంటి పనులు చేస్తున్నారు. కొవిడ్ టెస్టులు చేయించుకోకుండా వచ్చే వారికి పరీక్షలు చేయించడం, పాజిటివ్ అని తేలితే క్వారంటైన్ పంపడం వంటివి చేపట్టారు. జిల్లాలోని వీఆర్వోలందరికీ ఈ విధులను అప్పగిస్తున్నారు. నెలకు సంబంధించిన షెడ్యూల్ ను ముందుగానే రూపొందిస్తున్నారు. ప్రతి రోజూ 10 మంది వీఆర్వోలు శంషాబాద్ విమానాశ్రయంలో పని చేస్తున్నారు.
ప్రతి వీఆర్వోకు నెలలో రెండు రోజులు విదేశీ ప్రయాణికుల వివరాలు సేకరించే డ్యూటీ చేస్తున్నారు. ఇంకొందరు రైసు మిల్లుల్లో ధాన్యం లెక్కలు చూస్తున్నారు. ఇలా రకరకాల విధుల్లో ఉన్నారు. అడ్డా మీద కూలీల మాదిరిగా పని చేస్తున్నామని పలువురు వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా రద్దయిన పోస్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నారు. అలాగే వీఆర్ఏలకు పే స్కేలు ప్రకటించిన సీఎం కేసీఆర్ తమకు దేవుడంటూ ఆ కుటుంబాలు కొలిచాయి. పాలాభిషేకాలు, కృతజ్ఞతా సభలు కూడా నిర్వహించారు. ఆ విషయాన్ని కూడా ఉన్నతాధికారులు పెండింగులోనే ఉంచారు.
చేరినా పోస్టింగ్ కరువు..
దీర్ఘ కాలిక సెలవులపై కొందరు అధికారులు, ఉద్యోగులు వెళ్లారు. తిరిగి విధుల్లో చేరిన వారికి పోస్టింగులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన వెంటనే పోస్టింగు ఇవ్వకుండా కనీసం మూడు, నాలుగు నెలల పాటు ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇస్తున్నారని సమాచారం. అది జూనియర్ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్ వరకు ఉంది. అయినా చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ చొరవ తీసుకోకపోవడంతో చేరిన రోజే పోస్టింగు ఇవ్వకుండా ఫైళ్లను పెండింగులో ఉంచుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఓ డిప్యూటీ కలెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఆయన సస్పెన్షన్ ను ఎత్తేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినా పోస్టింగు ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారు. సదరు ఫైలు సీఎంఓలోని ఓ సీనియర్ ఐఏఎస్ దగ్గర ఉంది. సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ ఆ ఐఏఎస్ అధికారుల సమయం మాత్రం లభించదని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
విధుల్లేని అదనపు కలెక్టర్లు..
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి రెవెన్యూ శాఖలో సందిగ్ధత నెలకొంది. జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేశారు. వారి స్థానంలో ప్రతి జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించారు. అప్పటి నుంచి ఫైళ్ల విచారణలో గందరగోళం నెలకొన్నది. ఇంకా అదనపు కలెక్టర్ల జాబ్ చార్టును రూపొందించలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వారికి వేతనాలు కూడా పాత స్థానంలోనే పొందుతున్నారు. ఆ పాత స్థానంలో ఎవరైనా చేరితే జీతాలు కూడా తీసుకోలేని దుస్థితి నెలకొంది. ఇలా 18 మంది అదనపు కలెక్టర్లు వేతనాల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కొందరు జాయింట్ కలెక్టర్లకు పోస్టింగు దక్కలేదని సమాచారం. కనీసం అదనపు కలెక్టర్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు.
కొత్త మండలాలకు పోస్టింగులేవి?
రెవెన్యూ పాలనను సరళీకృతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. కానీ ఆయా మండలాలకు పోస్టింగులు మంజూరు చేయలేదు. ఇప్పటికీ పాత వ్యవస్థ ద్వారా, డిప్యూటేషన్ల ద్వారానే చాలా మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ధరణి పోర్టల్ అమలులో ఇంకా అనేక లోపాలు ఉన్నాయి. వాటిని కనీసం చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదని ఓ అధికారి స్పష్టం చేశారు. ఏ సమస్యనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెలలు గడిచినా అధికారులు అమలు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు.