- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారీ ఉద్యోగుల్లో 'ఆప్షన్'..టెన్షన్..!
దిశ, నిర్మల్ కల్చరల్ : జిల్లాలో నూతనంగా విభజన చెందిన నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఉద్యోగుల్ని కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. దీనికై ఇటీవల జీవో 317 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరో పాతికవేల మంది ఇతర శాఖల ఉద్యోగులు మొత్తంగా 35వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే ఈ నాలుగు కొత్తజిల్లాలకు కేటాయించడానికి ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బదిలీల్లో ప్రతి ఉద్యోగి ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలను ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్ గా ఎంపిక చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఎక్కడా ‘బదిలీ’ అన్న పదం రాకుండా కొత్తజిల్లాలకు ‘కేటాయింపు’ పేరుతో చేపట్టిన ప్రక్రియతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కేటాయింపులు పుట్టిపెరిగి, విద్యాభ్యాసం చేసిన వంటి అంశాల ‘స్థానికత’ ఆధారంగా కాకుండా సీనియారిటీ ప్రకారం ఉంటుందని చెప్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జిల్లాల వారు మొదటి ఆప్షన్ గా నిర్మల్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే.. వీరిని సీనియారిటీ ప్రకారం కేటాయిస్తే మిగిలినవారు ప్రాధాన్యతా క్రమంలో ఇతర జిల్లాలకు కేటాయిస్తారు. ఆ లెక్కన ఇటీవల కారుణ్య నియామకాలు , టీఎస్పీఎస్సీ, టీఆర్టీ, డీఎస్సీల ద్వారా నియామకమైనవారు సీనియారిటీ ప్రాధాన్యతా క్రమంలో చివరలో ఉంటారు. వీరంతా ఆసిఫాబాద్, మంచిర్యాల లోని మారుమూల ప్రాంతాలకు ఆటోమేటిక్‌గా వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.
కొత్త లెక్కల ప్రకారం బాసర జోన్‌కు సంబంధించిన ఉద్యోగి కాళేశ్వరం జోన్‌కు ‘కేటాయింపు’ల కింద వెళ్లినట్లు లెక్క. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సదరు ఉద్యోగి పోస్టు జిల్లాస్థాయి అయితే జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది. ఒకవేళ అదే ఉద్యోగిది జోనల్ పోస్టు అయితే మాత్రం కాళేశ్వరం జోన్లోని ఆదిలాబాద్, అసిఫాబాద్‌కు వెళ్లాల్సిందే. ఇక వితంతువులకు ప్రాధాన్యం అన్న విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన మహిళల్లో 95 శాతం పైగా వితంతువులే ఉంటారు. మిగతా కొద్దిమంది తండ్రిస్థానంలో ఉద్యోగం వచ్చినవారు ఉంటారు. వీరంతా జూనియర్లుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిందే.
విద్యాశాఖలోనూ సీనియారిటీ వివరాల సేకరణ..
జిల్లాలోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న మండలాల్లోని ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ కార్యాలయాల్లో సీనియారిటీ వివరాలు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ఆసిఫాబాద్, జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 10 వేల మందికి పైగానే ఉన్నారు. సీనియారిటీ ప్రాతిపదికనే జిల్లాలను కేటాయిస్తారనడంతో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్థానికత’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో నియామక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభచూపి మంచిస్థానాలు పొందిన జూనియర్లకు ఇప్పుడు నష్టం కలగనుందనేది ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారుచేయడంలో నాలుగురోజులుగా విద్యాశాఖాధికారులు నిమగ్నమైఉన్నారు.
ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు..
కేటాయింపు ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని ఆయా ఉపాధ్యాయ సంఘాలనుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో అసంబద్ధమైన జీఓ 317పై, ‘స్థానికత’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేటాయింపుల అంశాన్ని తెరపైకి తేవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, తగిన కసరత్తు చేయకుండా హుటాహుటిన ప్రక్రియ ప్రారంభించడం పట్ల న్యాయస్థానం తలుపుతట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.