సీఎస్ ఆదేశాలు.. గందరగోళంలో కలెక్టర్లు

by Anukaran |   ( Updated:2021-06-05 07:12:53.0  )
సీఎస్ ఆదేశాలు.. గందరగోళంలో కలెక్టర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్లుగా తిరుగుతున్నాం. తహసీల్దార్​ పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను కలిసినా పరిష్కారం కాలేదు. మేం భూమిని కొనుగోలు చేసి ఏండ్లు గడుస్తోంది. నేటికీ పట్టాదారు పాసు పుస్తకం రాలేదు. మాకు రైతుబంధు రావడం లేదు.. అంటూ వారం రోజులుగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్​వేదికగా ఫిర్యాదుల వెల్లువ దర్శనమిస్తోంది. ధరణి పోర్టల్​ అమలైన తర్వాత దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం కలగలేదు. మా పట్టా భూములను రిజిస్ట్రేషన్​ నిషేధిత భూముల జాబితా(పీఓబీ)లో పెట్టారు. మేం చేసిన తప్పేమిటంటూ తహసీల్దార్లను నిలదీస్తున్నారు.. ఇలాంటి సమస్యలన్నింటికీ మరో మూడంటే మూడు రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్ ​ఆదేశించారు.

ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు, భూ విషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించాలన్నారు. 9వ తేదీలోగా పరిష్కరించి తద్వారా ఆ రైతులు రైతుబంధు సాయం పొందేలా చూడాలని ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో ధరణికి సంబంధించిన విషయాలపై బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్​ ఆదేశాలతో కొందరు కలెక్టర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇచ్చిన గడువు మూడు రోజులు. ఇప్పటికే అనేక పని ఒత్తిడి కారణంగా వివాదాస్పద భూములకు పరిష్కారం చూపలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇన్నాండ్లుగా పేరుకుపోయిన పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలంటే ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత ఇరువురి వాదనలు వినాలి. ఆ తర్వాత ఆర్డర్లు జారీ చేయాలి. ఈ ప్రాసెస్​ చేసేందుకు కనీసం నెల రోజులైనా పడుతోంది. అది కూడా అదనపు భారాలేవీ లేకపోతే ధరణి పోర్టల్​ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించే వీలుంటుందని చర్చించుకుంటున్నట్లు తెలిసింది. కొందరు కలెక్టర్లు మాజీ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మూడు రోజుల్లోనే పూర్తి చేయాల్సి వస్తే చోటు చేసుకునే తప్పిదాలకు బాధ్యులమవుతామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గైడ్​లైన్స్ ​లేవు

ధరణి పోర్టల్​లోని మాడ్యూల్ ​ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలే జారీ చేయలేదు. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం ధరణి పోర్టల్​లో డేటాను సవరించే అధికారం ఎవరికి ఉందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ క్రమంలో అన్ని సమస్యలకు తహసీల్దార్లు పంపే నివేదికలే ప్రామాణికంగా కలెక్టర్లు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రతి కేసుకు సంబంధించిన రిపోర్టులు పంపకపోతే ఆదేశాలు జారీ అవుతున్నాయని తెలిసింది. ఒక్కో కేసుకు తహసీల్దార్ ​నాలుగు పేజీల నివేదిక రాస్తున్నారు. అది చదివిన తర్వాతనైనా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చు.

కానీ పీఓబీలో ఉంచాలా? తీసేయాలా? రిజెక్ట్​చేయాలా? పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలా? వద్దా? స్పెసిఫిక్​గా సిఫారసులు పంపాలంటూ తహసీల్దార్లపై కలెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ధరణి పోర్టల్​లోని ప్రతి మాడ్యూల్​కు పరిష్కార మార్గాలు, అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదన్న అంశాలపై మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ప్రతి పనికీ తహసీల్దార్ ​సెంట్రిక్​గా మారుతోంది. కొందరు కలెక్టర్లు వారిచ్చిన రిపోర్టులను కనీసం చూడకుండా పెండింగులో పెడుతున్నారు. ప్రధానంగా నిషేదిత భూముల జాబితా సవరణపై రెవెన్యూ అధికారుల్లోనే సందిగ్ధత నెలకొంది. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నాలే చేస్తున్నారని పలువురు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

నెలాఖరుకల్లా ఆర్డర్లు

స్పెషల్ ట్రిబ్యునల్‌లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్‌లను కూడా నిర్వహించాలని సీఎస్​సోమేష్​ కుమార్​ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెలాఖారుకల్లా అన్నీ పూర్తి చేయాలని, ఆర్డర్లు జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. గతంలో ఓ సారి ఇచ్చిన ఆర్డర్లే కానీ హైకోర్టు ఆదేశాలతో ఇరుపక్షాల వాదనలు వినేందుకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరైన సమయం ఇవ్వకుండా పూర్తి చేయాలని ఒత్తిడి చేయడం వల్ల మళ్లీ పాత ఆర్డర్ల వంటివే పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొందరు కలెక్టర్లు లాక్​డౌన్ ​కాలంలోనే ట్రిబ్యునల్ ​కేసుల్లో వాదనలను వినిపించాలంటూ నోటీసులు పంపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలానికి సంబంధించిన ఓ కేసులో ఇరుపక్షాలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రావాలని నోటీసులు జారీ చేయడం విశేషం. ఒంటి గంట వరకే రాకపోకలకు వీలుంది. ఈ క్రమంలో కలెక్టరేట్​కు ఎలా రావాలో అర్ధం కావడం లేదని సంబంధిత దరఖాస్తుదారులు, న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు కాకపోతే ట్రిబ్యునల్ ​ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారు.

మళ్లీ కలెక్టర్లకే కదా..

భూ సమస్యలా? ఐతే వెంటనే వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి. వెంటనే అధికారులు స్పందిస్తారు. ఈ మెయిల్ కూడా చేయొచ్చునని సీఎస్ ​సూచించారు. ఇన్నాండ్లుగా ధరణి పోర్టల్‌లోని వివిధ మాడ్యూల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఐతే ఎలా ఫిర్యాదు చేసినా తిరిగి కలెక్టర్లకు తిప్పి పంపడం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. అలాంటప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక నంబరును ఇవ్వడమంటే భూ పరిపాలనను కేంద్రీకృతం చేయడమేనని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ కలెక్టర్లకే పంపుతున్నప్పుడు వారికే దరఖాస్తు చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. కేంద్రీకృత భూ పరిపాలన వల్ల సత్వర పరిష్కారంలో ఎడతెగని జాప్యం జరగడం ఖాయమని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ ​యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్​కుమార్​అన్నారు. వాట్సాప్, మెయిల్​కు ఫిర్యాదులు అందినా వాటిని ఎవరు మానిటర్ ​చేస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన నివేదికలు ఇవ్వాలి? ఇలాంటి అంశాలపైనా మార్గదర్శకాలు లేకపోవడం వల్లనే సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయన్నారు.

భూ సమస్యలా.. ఫిర్యాదు చేయండి
వాట్సాప్ నంబరు: 9133089444
ఈ మెయిల్: [email protected]

Advertisement

Next Story

Most Viewed