మిడ్జిల్‌లో ఉద్రిక్తత.. రావణ దహనం అడ్డగింత

by Shyam |
Ravana burning
X

దిశ, జడ్చర్ల: మిడ్జిల్ మండల కేంద్రంలో విజయదశమి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దసరా సందర్భంగా రావణ దహనం కోసం భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ దళిత యువకులు రావణ దహనాన్ని అడ్డుకున్నారు. తమ వారసుడైన రావణాసురుడిని దహనం చేయకూడదని గొడవకు దిగారు. అంతేగాకుండా.. రావణ దహనం కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో దళిత యువకులపై దాడికి యత్నించారు.

దీంతో ఒక్కసారిగా అరుపులు కేకలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ జమ్ములప్ప ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో కొంతమంది అల్లరిమూకలు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అనంతరం కొంతమంది అల్లరి మూకలను అదుపులోకి తీసుకొని కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చగా, వారికి కోర్టు పదిహేను రోజుల రిమాండ్ విధించినట్లు మిడ్జిల్ ఎస్ఐ జయప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed