మానుకోట దద్దరిల్లింది.. దండం పెట్టినా వదలని కార్యకర్తలు

by Anukaran |   ( Updated:2021-02-25 07:44:53.0  )
మానుకోట దద్దరిల్లింది.. దండం పెట్టినా వదలని కార్యకర్తలు
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభ కొట్లాటకు దారి తీసింది. సభ మీద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. స్థానిక కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎంత చెప్పినా వినకుండా ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతేకాదు, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ చేతులెత్తిమొక్కినా ఏ ఒక్క కార్యకర్త కూడా శాంతించలేదు. సుమారు గంటసేపు డౌన్.. డౌన్.. గో బ్యాక్.. నినాదాలతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సన్నాహాక సమావేశం మార్మోగింది.

అసలేంజరిగింది..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల శ్రేణులు, పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు వచ్చారు. ఇందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించి మైక్‌ను.. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ ఇచ్చారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా రామచంద్రు నాయక్ పేరును ప్రస్తావించారు. ఇదే సమయంలో డోర్నకల్ కో ఆర్డినేటర్ నెహ్రు నాయక్ పేరు చదవకపోవడంతో ఘర్షణ ప్రారంభంఅయింది.

దీంతో నెహ్రూ నాయక్ వర్సెస్ రామచంద్రు నాయక్ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా, అనూహ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మురళీ నాయక్ వర్గీయులు గోబ్యాక్.. బలరాం నాయక్.. అంటూ నినాదాలు చేశారు. ముగ్గురు నాయకులకు చెందిన వర్గీయుల ఆందోళనలు, నినాదాలతో వేదిక ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఉత్తమ్ చెప్పినా.. బలరాం దండం పెట్టినా వినలేదు!

ఎంతసేపటికి కూడా గొడవ సద్దుమణగకపోవడంతో.. మాజీ మంత్రి బలరాం నాయక్ లేసి దండం పెడుతా ఆగండి అంటూ ఇరువర్గాల, కార్యకర్తలను వేడుకున్నారు. చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చిలో నుంచి లేసి మరీ కార్యకర్తలను సముదాయించినా ఎవ్వరూ వినలేదు. చివరకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్.. క్రమ శిక్షణను అలవర్చుకోవాలని కోరగా కార్యకర్తలు కాస్త శాంతించారు. అయితే, సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ..రచ్చ చేయడంతో అక్కడికి వచ్చిన ఇతర నాయకులు కూడా తీవ్ర అసహనంతో వెనుదిరిగారు. దీంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed