- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ కార్పొరేటర్లలో టెన్షన్..
దిశ, తెలంగాణ బ్యూరో: వరదలు ఎన్నికల్లో ముంచేస్తాయా.. ముంపు సాయం కాపాడుతుందా.. లేదా ఇరుకున పడేస్తుందా. ఇది కాదంటే విజయం వైపు దూసుకెళ్లేలా చేస్తుందా. పరిహారంపై ప్రజాగ్రహం పాతళంలోకి తొక్కెస్తుందా..! అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పరిహారం డబ్బుల పంపిణీ కార్యక్రమంగా మారిందనే ఆరోపణలు నిజమయ్యాయా.. ? షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తే పుట్టి మునగక తప్పదా. ఇలా అనేక ప్రశ్నలు అధికార పార్టీని తొలిచివేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలపై ముందుకెళ్లాల్లా..లేదా వెనక్కి తగ్గాలా అనేది అర్థంకాకుండా పోతోంది. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తుంటే.. ఎన్నికలపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారానేది సర్వత్రా ఆసక్తికర చర్చగా కొనసాగుతోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తున్న జీహెచ్ఎంసీ పాలకవర్గం స్థానంలో కొత్త వారిని ఎన్నుకునే ప్రక్రియ ముందుకు సాగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే ఎన్నికల కోసం అవసరమైన సామగ్రిని ఎన్నికల అధికారులు నగరానికి తీసుకొచ్చి భద్రపరిచారు. రాష్ట్రంలో అధికార పార్టీ రాజకీయం ఊపు మీద ఉండటంతో డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. అంతలోనే ఆకస్మాత్తుగా భారీ వర్షాలు నగరంలోని చెరువులు, రోడ్లతో పాటు నాయకుల ఆశలకు గండ్లు కొట్టాయి. వర్షం కురిసిన పది రోజుల వరకూ బస్తీలు, కాలనీల్లో ప్రజలు వరద నీటిలోనే ఉండిపోయారు. తాగడానికి నీళ్లు కూడా దొరకక అవస్థలు పడ్డారు. ఐటీ ఉద్యోగులు, ఖరీదైన జీవితాలు అనుభవిస్తారనుకున్న ఏరియాలు, దిగువ ప్రాంతాలు సైతం బురదలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై ప్రజలు తమ ఆవేదన, ఆగ్రహాలను వ్యక్తం చేశారు. స్వయంగా కేటీఆర్ సైతం వరద బాధిత ప్రజలతో మాటలు పడక తప్పలేదంటే వర్షాలు ఎంత బీభత్స పరిస్థితులను సృష్టించాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రజాగ్రహం..
ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న సంకేతాల్లో ఉన్న కార్పొరేటర్లకు అప్పటికే కేటీఆర్ మార్గనిర్దేశనం చేశారు. పనితీరు మార్చుకోవాల్సిన కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి గట్టిగానే హెచ్చరికలు చేశారు. ఇంతలోనే వరదలు నగరాన్ని ముంచెత్తాయి. మనుషులు కొట్టుకుపోయినా, మనిషి మునిగిపోయేంత లోతు నీళ్లలో మునిగినా తమను కనీసం చూసిన వాళ్లు లేక ప్రజలు అల్లాడిపోయారు. వర్షాల తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మందలించేందుకు ప్రజలకు దగ్గరకు వెళ్లిన ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురయ్యారు. గ్రేటర్‌తో పాటు పరిసర కార్పొరేషన్లలోనూ వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చీవాట్లు తిన్నారు. కోపాన్ని అదుపుచేయలేక కొందరైతే బూతులు, చెప్పులతో ప్రజాప్రతినిధులపై దాడులకు దిగారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈ ప్రభావం ఎన్నికల్లోనూ కనిపించే అవకాశముందని కార్పొరేటర్లు భయాందోళనల్లో పడ్డారు. అప్పటికే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉందని మంత్రి చెప్పడంతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత కూడా తోడైతే ఊహించని విధంగా ఓటమి పాలవుతామని మెజార్టీ కార్పొరేటర్లు భావించారు.
ఇంతలోనే వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.380 కోట్ల పంపిణీ పూర్తయినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో ఎక్కువ భాగం కార్పొరేటర్లు, రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుల జేబుల్లోకి వెళ్లాయన్న విమర్శలను ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. తమకు కూడా సాయం ఇవ్వాలని కోరిన నిజమైన ముంపు బాధితులను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దరిదాపుల్లోకి రానివ్వలేదు. కేటీఆర్ సైతం వరద సాయం కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోపద్రిక్తులైన ప్రజలు రోడ్ల మీదకు, జీహెచ్ఎంసీ కార్యాలయాలు, కార్పొరేటర్ల ఇండ్లు తేడా లేకుండా నిరసనలు చేశారు. నిజమైన అర్హులకు ఇవ్వకుండా రాజకీయ నాయకులే పంచుకోవడమేంటని ప్రశ్నించారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితుల్లో ముందస్తు ఎలక్షన్లు నిర్వహిస్తే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయోనని అధికార పార్టీ కార్పొరేటర్లు భయపడుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం..
వరదల ప్రభావం తగ్గిన తర్వాత ఎస్ఈసీ తమ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలతో పాటు అభ్యంతరాలు, సలహాలు తదితర అంశాలపై గడువు తేదీలతో సహా ప్రణాళికను ప్రకటించింది. నవంబర్ 13న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎస్ఈసీ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రకారమైతే.. అందరూ ఊహించినట్టుగానూ డిసెంబర్‌లోనే ఎన్నికల జరగాల్సి ఉంటుందని అంచనా.. అయితే వరదల అనంతరం రెండు నెలల్లోపే ఎన్నికలు వస్తే టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తాయని రాజకీయ పార్టీలు విశ్లేషణ చేస్తున్నాయి.
ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకున్న కార్పొరేటర్లతో పాటు గ్రేటర్‌లోని అందరు కార్పొరేటర్లు వరదల దెబ్బకు ఒకే గొడుగు కిందకు చేరిపోయారు. ఎస్ఈసీ ప్రకటన ప్రకారమే ఎన్నికల జరిగితే ఈ ప్రభావం సిట్టింగ్ కార్పొరేటర్లను ఘోరంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలు హాట్ హాట్‌గా మారాయి. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ కూడా చేసిన నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ తన పద్ధతిలో తాను ముందుకు వెళ్తున్నా.. అధికార పార్టీని కాదని ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదు. అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలను నిర్వహించడం కూడా ఎన్నికల సంఘానికి కష్టంగా మారనుంది. అయితే సన్నగిల్లిన గెలుపు అవకాశాలు, పోటీకి సాహసం కూడా చేయలేని స్థితిలో గ్రేటర్ కార్పొరేటర్లు పడిపోయారు.
అధికార పార్టీ కార్పొరేటర్లలో ఆందోళన..
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికార పార్టీ కార్పొరేటర్లకు పెద్ద చిక్కుప్రశ్నగా మారింది. ఎన్నికల సంఘం యథావిధిగా రెండు నెలల్లోపు ఎన్నికలకు వెళ్తే తమకు ఓటమి తప్పదని అధికార పార్టీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఒక్కో డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో ప్రజలు కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో కనిపిస్తుందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే వరద సాయం పంపిణీ పేరుతో అధికార పార్టీ నాయకుల చేతుల్లో డబ్బులు పెట్టడంతో పాటు, కొన్ని చోట్ల నేరుగా ఓట్ల ప్రచారాన్ని చేసుకున్నారని ప్రజలు తెలపడం గమనార్హం.
ఇంటి ఓనర్లు, స్థానిక పలుకుబడి ఉన్నవారికి నష్టంతో సంబంధం లేకుండా సాయం అందింది. నిజమైన పేదలు, వరదలో మునిగినా బాధితులకు ఓట్లు లేకపోవడం కూడా సాయం చేరకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల డబ్బుల పంపిణీ కార్యక్రమంగా మారిన వరద సాయం తమను గెలిపిస్తాయని అధికార పార్టీ భావిస్తుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీసుకున్నవారు వేసినా.. ఇతర ప్రజల నుంచి ఓట్లు రాబట్టడం అధికార పార్టీ నాయకులకు కష్టమే.. ఎలా చూసినా వరదలు సిట్టింగ్ కార్పొరేటర్లలో ముందస్తు ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు హడావుడి చేస్తున్నా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమకు అనుకూలంగా అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.