- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటకు కొత్త ముప్పు.. రవీందర్ దండీవాల్
దిశ, స్పోర్ట్స్: క్రీడాలోకానికి ఎప్పుడూ ఉండే ముప్పు ఫిక్సింగ్. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ తదితర టీమ్ స్పోర్ట్స్‌లో తరుచూ ఫిక్సింగ్ అనే మాట వింటుంటాం. తాజాగా ఇది వ్యక్తిగత క్రీడైన టెన్నిస్‌కి కూడా పాకింది. ఏనాటి నుంచో క్రీడల్లో ఫిక్సింగ్‌కు ఇండియా, పాకిస్తాన్‌లే కేంద్ర బిందువులు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టెన్నిస్ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేస్తున్నది పంజాబ్‌లోని మొహలీకి చెందిన వ్యక్తి అని బయటపడింది. అతనే రవీందర్ దండీవాల్. ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ఈ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు. బయటకు ఎక్కడా కనపడకపోయినా గత నాలుగైదు ఏళ్లుగా టెన్నిస్ మ్యాచ్‌ల ఫిక్సింగ్‌తోపాటు అనధికార క్రికెట్ లీగ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు అతని అనుచరులు ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసుల అదుపులో ఉన్నారు. గతవారమే వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక రిపోర్టు చేసింది.
ఏం జరిగింది?
ఆస్ట్రేలియాలో క్రీడలపై బెట్టింగ్ నిర్వహించడం చట్టపరంగా నేరం కాదు. అక్కడ అనేక వెబ్‌సైట్లు అధికారికంగానే బెట్టింగ్ నిర్వహిస్తుంటాయి. అయితే, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు రాజేశ్ కుమార్, హర్‌సిమ్రత్ సింగ్‌లు బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని ఫిక్సింగ్ కోసం దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారించగా బ్రెజిల్, ఈజిప్టు దేశాల్లో 2018లో జరిగిన టెన్నిస్ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసినట్లు తెలిసింది. వీళ్లు ఇండియా కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ టెన్నిస్ ఫిక్సింగ్ ముఠాలో సభ్యులని తేల్చారు. తక్కువ ర్యాంకులు కలిగిన టెన్నిస్ క్రీడాకారులకు డబ్బుల వల వేసి మ్యాచ్‌లను ఫిక్స్ చేసే వాళ్లని, ఈ ఫిక్సింగ్ ముఠాకు రవీందర్ దండీవాల్ నాయకుడని తేలింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు కేవలం రెండు టోర్నమెంట్లు ఫిక్స్ చేసి రూ.2.5 కోట్ల వరకు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఏయే క్రీడాకారులతో ఫిక్సింగ్ చేయించాలనే వివరాలను ఈ ఇద్దరికీ దండీవాల్ చెప్పేవాడని పోలీసులు అంటున్నారు.
ఎవరీ దండీవాల్?
పంజాబ్‌లోని మొహలీకి చెందిన దండీవాల్ ఎప్పటి నుంచో బెట్టింగ్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు. టెన్నిస్ మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేయడమే ఇతని ప్రధాన వృత్తి. గ్రాండ్‌స్లామ్స్ వంటి పెద్ద ఈవెంట్లలో కాకుండా బెట్టింగ్‌కు అనుమతించిన మ్యాచ్‌లను ముఖ్యంగా ఏటీపీ టూర్‌లో భాగమైన టెన్నిస్ మ్యాచ్‌లను ఫిక్స్ చేస్తుంటాడు. తక్కువ ర్యాంక్ గల క్రీడాకారుల మధ్య జరిగే మ్యాచ్‌లను ఫిక్స్ చేసి రూ.కోట్లు ఆర్జించాడు. ఇతను ఎప్పుడూ ప్రత్యక్షంగా ఆటగాళ్లకు ఫోన్స్ చేయడం కానీ, కలవడం కానీ చేయడని అంతా అనుచరుల సాయంతోనే చేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. ఆటగాళ్లకు హవాలా, బిట్ కాయిన్స్ రూపంలో డబ్బును అందిస్తాడని, దీంతో ఇతని వ్యవహారాలు బయటకు తెలియదని చెబుతుంటారు.
క్రికెట్‌లోనూ వేలు పెట్టాడు
రవీందర్ దండీవాల్ అనుచరులు ఆస్ట్రేలియా పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసిన వెంటనే బీసీసీఐ రంగంలోకి దిగింది. దండీవాల్‌పై నిఘా పెట్టినట్లు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) హెడ్ అజిత్ సింగ్ నిర్ధారించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు రుజువులు లేకపోయినా లీగ్స్‌కు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో తలదూర్చినట్లు తెలుస్తున్నది. ఏసీయూ కొంత కాలంగా రవీందర్ దండీవాల్‌పై చేసిన దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో బీసీసీఐకి వ్యతిరేకంగా క్రికెట్ లీగ్స్ నిర్వహించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటమే కాకుండా, ఆ లీగ్‌లోని ఒక ఫ్రాంచైజీకి అతను సీఈవోగా కూడా పని చేశాడు. ఐసీసీకి వ్యతిరేకంగా బ్యాంకాక్‌లో క్రికెట్ లీగ్ నిర్వహించడానికి ప్రయత్నించాడు. కానీ, థాయిలాండ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ హెచ్చరికలు జారీ చేయడంతో అతణ్ని వదిలించుకుంది.
బీసీసీఐ ఎందుకు వదిలేసింది?
ఐసీసీ, బీసీసీఐలకు వ్యతిరేకంగా క్రికెట్ లీగ్స్ నడిపిస్తున్నా రవీందర్ దండీవాల్‌ను ఎందుకు వదిలేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అజిత్ సింగ్ స్పందించారు. అతను క్రికెట్ వ్యతిరేక కార్యకలాపాలు బీసీసీఐ పరిధిలో చేయలేదు. కానీ, బయటి దేశాల్లో మాత్రమే క్రికెట్‌కి సంబంధించి వేలు పెట్టాడని అన్నారు. ఇండియాలో అతడు నిర్వహించిన లీగ్స్‌లో నేరుగా పాల్గొనలేదని కూడా బీసీసీఐ చెబుతున్నది. అతనిపై ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేశామని, అలాగే నిరంతరం అతనిపై నిఘా కొనసాగుతున్నదని బీసీసీఐ స్పష్టం చేసింది.