బంగారు తెలంగాణ కాదిది.. బాధల తెలంగాణ: వైఎస్ షర్మిల

by Vinod kumar |
బంగారు తెలంగాణ కాదిది.. బాధల తెలంగాణ: వైఎస్ షర్మిల
X

దిశ, తిరుమలాయపాలెం: బంగారు తెలంగాణ కాదిది.. బాధల తెలంగాణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ.. అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ చేపట్టిన పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం సోలిపురం వద్ద వైఎస్ షర్మిల పాదయాత్ర, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఆధ్యంతం కోలాటాలు, ఓదార్పులు నడుమ పాదయాత్ర సాగింది. సూర్యాపేట జిల్లా మోతె నుంచి తిరుమలాయపాలెం మండల పరిధిలోని కూడలి సోలిపురం బ్రిడ్జి వద్ద పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించగానే మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. సోలిపురం క్రాస్ రోడ్డు, కాకరవాయి గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

కాకరవాయి గ్రామంలో బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బార్లు - బీర్లు - ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు. ఉద్యమం చేసిండని ఆ కేసీఆర్ ను రెండు సార్లు సీఎం చేస్తే.. ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు గారడి మాటలు తప్ప కేసీఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి లేదని అన్నారు. మళ్ళీ కేసీఆర్ మాటలకు మోసపోవద్దని సూచించారు.


ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనాలని, ఇది రాజకీయ వ్యభిచారం కాదా అన్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్నించే ప్రతిపక్షాలున్నాయాని మాటిస్తే మడమ తిప్పని వైయస్సార్ బిడ్డగా చెప్తున్నా.. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానన్నారు.

అనంతరం జూపెడ, బచ్చోడు తండా మీదగా బచ్చోడు గ్రామం చేరుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో స్థానికులతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.


ప్రజలు తెలిపిన సమస్యలకు స్పందించిన పార్టీ అధినేత్రి షర్మిల రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తుందని, రాజన్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర కో-ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed