ఆయుధాలతో సభకు వచ్చారా? టీడీపీ సభ్యులపై అంబటి ఆగ్రహం

by Javid Pasha |   ( Updated:2022-03-22 09:21:16.0  )
ఆయుధాలతో సభకు వచ్చారా? టీడీపీ సభ్యులపై అంబటి ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో : అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. శాసనసభ సంప్రదాయాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మంగళవారం సభలో టీడీపీ సభ్యుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన సభలో విజిల్స్, కేకలు వేయడం, ఇంకా వారి తీరు చూస్తుంటే ఏమేమి ఆయుధాలు తీసుకువచ్చారో చెక్‌ చేయాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు. సభా సంప్రదాయాలను పాటించని వ్యక్తులు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించ వద్దని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. స్పీకర్‌ చైర్‌కు వేలు చూపిస్తూ ఘర్షణ చేస్తున్నారని.. మాట్లాడే అవకాశం రాకపోతే విజిల్స్‌ వేస్తారా..? ఆయుధాలు తీసుకువస్తారా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే శాసనసభలోకి విజిల్స్‌ తీసుకువచ్చి టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

Advertisement

Next Story