ఆ హక్కు పవన్‌కు లేదు.. ఆయనది గెస్ట్‌రోల్ మాత్రమే: మంత్రి

by Javid Pasha |
ఆ హక్కు పవన్‌కు లేదు.. ఆయనది గెస్ట్‌రోల్ మాత్రమే: మంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయ నాయకుడు అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ అనుకోవడం లేదని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌‌‌‌ది రాజకీయాల్లో గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌కు గెస్ట్‌ ఆర్టిస్టు అని చమత్కరించారు. నెలరోజుల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నాడని ఆ తర్వాత పొరుగు రాష్ట్రం వెళ్లిపోయాడని ఆరోపించారు. ఈ నెల రోజులు రాష్ట్ర ప్రజలను ఏమైనా పట్టించుకున్నారా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. తాజాగా మళ్లీ ఇప్పుడు వచ్చి రైతు భరోసా యాత్ర అంటున్నాడంటూ విరుచుకుపడ్డారు.

పవన్ కల్యాణ్ తలపెట్టనున్న నిరసన కార్యక్రమం పేరు కూడా మా పార్టీ నుంచి కాపీ కొట్టాడంటూ ఎద్దేవా చేశారు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుకు.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చేపట్టబోయే రైతు భరోసా యాత్రకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కల్యాణ్ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైసీపీపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

ఏం ముఖం పెట్టుకుని రైతుల వద్దకు పవన్‌ కల్యాణ్‌ వెళ్తారు. రైతుల కోసం పని చేసే ఏకైక ప్రభుత్వం వైసీపీయే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న పవన్ కల్యాణ్ మరి ఇంకా ఆ బీజేపీతోనే ఎందుకు పొత్తులో ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజల మనోభవాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ పవన్‌ కల్యాణ్ వెంటనే బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed