డిస్నీ పిక్సర్ నిర్మించిన 'లైట్‌ఇయర్' బ్యాన్..

by Manoj |
డిస్నీ పిక్సర్ నిర్మించిన లైట్‌ఇయర్ బ్యాన్..
X

దిశ, ఫీచర్స్ : డిస్నీ పిక్సర్ నిర్మాణంలో జూన్ 17న విడుదలైన కొత్త యానిమేషన్ చిత్రమే 'లైట్‌ఇయర్'. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రంలో ఇద్దరు మహిళల మధ్య (సేమ్ సెక్స్ కిస్) ముద్దు సన్నివేశం కలిగి ఉంటుందని మేకర్స్ చెప్పడంతో యూఏఈ, సౌదీ అరేబియాతోపాటు 14 దేశాలు ఈ మూవీని నిషేధించాయి. నిజానికి స్క్రీన్‌పై LGBTQ పాత్రల ప్రస్తావన ఉన్న హాలీవుడ్ సినిమాలు గతంలో చాలా దేశాల్లో సెన్సార్ చేయబడ్డాయి. స్టూడియోలు తరచూ ఆయా చిత్రాలకు సవరణలు చేయడం సహా ఈ పర్టిక్యులర్ కంట్రీస్‌లో చిత్రాలను విడుదల చేసేందుకు అటువంటి సన్నివేశాలు, పాత్రలను తొలిగిస్తాయి. అయితే, డిస్నీ పిక్సర్ మాత్రం తన చిత్రాలను ఎడిట్ చేయకూడదనే వైఖరికి కట్టుబడి ఉంటుందని గత కొంతకాలంగా సూచిస్తోంది. ప్రైడ్ నెలలో వస్తున్న ఈ చిత్రం LGBTQ+ హక్కుల కోసం ఓ యుద్ధమే చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఎందుకు ఎల్‌జీబీటీక్యూ క్యారెక్టర్స్ ఉన్న చిత్రాలను ఆ దేశాలు బ్యాన్ చేస్తున్నాయో తెలుసుకుందాం.

వాణిజ్యపరంగా మాత్రమే కాకుండా విమర్శనాత్మకంగానూ ప్రశంసలు పొందిన 'టాయ్ స్టోరీ' సిరీస్‌కు ప్రీక్వెల్‌గా 'లైట్‌ఇయర్'ను రూపొందించారు. ఇందులో 'లైట్‌ఇయర్' ప్రధాన పాత్రకు మరొక మహిళతో సంబంధం ఉన్న స్నేహితురాలు ఉంటుంది. అయితే ఆ ఇద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉండటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా, ఈజిప్ట్, ఇండోనేషియాతో సహా పలు దేశాలు ప్రధానంగా స్వలింగ సంపర్కం లేదా దాని వర్ణనను నిషేధించే చట్టాల ప్రకారం సినిమాను బ్యాన్ చేశాయి. ఈ జంట సంబంధం.. దేశంలోని మీడియా కంటెంట్ ప్రమాణాలను ఉల్లంఘించిందని యూఏఈ పేర్కొంది. దీనికి బదులిస్తూ.. 'సామాజికంగా పరివర్తనం చెందుతూ ముందుకు అడుగులు వేయడంలో భాగం కావడం చాలా గొప్ప విషయం. కానీ వాటిని నిషేధించే ప్రదేశాలు ఇంకా ఉండటం నిరాశపరిచింది' అని లైట్‌ఇయర్ మేకర్స్ సమాధానమిచ్చారు.

డిస్నీ సంక్లిష్టమైన LGBTQ+ చరిత్ర

డిస్నీ-పిక్సర్ యానిమేషన్‌ చిత్రంలోని 'ఎల్‌జీబీటీక్యూ'ల సన్నివేశాలు ప్రత్యేకంగా, ప్రగతిశీలంగా అనిపించినప్పటికీ.. పలు దేశాల్లో మాత్రం 'క్వీర్ హైప్'ని సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో డిస్నీ తమ 'ఫైండింగ్ డోరీ' ట్రైలర్‌ను విడుదల చేయగా, అందులో ఓ సన్నివేశంలో లెస్బియన్ జంటను గుర్తించిన కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. ఇక ఆ తర్వాత 'టాయ్ స్టోరీ 4' విడుదలైన తర్వాత కూడా ఆ మూవీలో 'డే కేర్‌'లో తమ బిడ్డను దింపుతున్న లెస్బియన్ జంట సన్నివేశాన్ని పలు ఆన్‌లైన్ కమ్యూనిటీలు హైలైట్ చేసి రాద్ధాంతం చేశాయి. ఇలా ప్రతీసారి డిస్నీ క్వీర్ కమ్యూనిటీ సీన్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం 'లైట్‌ఇయర్'లోనూ 'సేమ్ సెక్స్ కిస్' విషయంలో డిస్నీ భారీ ముందడుగు వేయగా.. మరోసారి దాడిని ఫేస్ చేస్తోంది.

మరికొన్ని ఉదాహరణలు :

డిస్నీ మార్వెల్ అత్యంత విజయవంతమైన 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్'‌లోని చావెజ్ పాత్ర తన ఇద్దరు తల్లులను గుర్తుచేసుకునే సన్నివేశాన్ని సూచిస్తూ, 12 సెకన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డ్‌ను సౌదీ అధికారి కోరినట్లు ది గార్డియన్ నివేదించింది. చివరికి ఈ సినిమాపై నిషేధం విధించారు. జనవరిలో విడుదలైన 'వెస్ట్ సైడ్ స్టోరీ' చిత్రం కూడా చాలా గల్ఫ్ దేశాల్లో ప్రదర్శితం కాలేదు. ఇది ట్రాన్స్‌జెండర్ వ్యక్తి పాత్ర అయిన 'ఎనీబడీస్' కారణంగా నిషేధం ఎదుర్కొంది. కానీ క్వీర్ కమ్యూనిటీ చిత్రాలను బ్యాన్ చేసే విషయంలో గల్ఫ్, ఆగ్నేయాసియాలకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. 2017లో డిస్నీ 'బ్యూటీ అండ్ ది బీస్ట్' విడుదల రష్యన్ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ చిత్రం డిస్నీ చరిత్రలో మొదటిసారిగా బహిరంగ స్వలింగ సంపర్కుడి పాత్రను చూపించింది. దీంతో రష్యా పార్లమెంటు సభ్యుడు ఈ చిత్రాన్ని 'సిగ్గులేని పాపపు ప్రచారం'గా అభివర్ణించాడు. రష్యాలో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించబడనప్పటికీ, దానికి సంబంధించిన 'ప్రచారం' మాత్రం శిక్షకు దారితీస్తుంది. నిజానికి ఎల్‌జీబీటీక్యూ వ్యక్తుల సాంస్కృతిక, సామాజిక అంగీకారం సహా వారిని నియంత్రించే చట్టాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా చలన చిత్రాల్లో ఎల్‌జీబీటీక్యూ రిఫరెన్స్ ఉన్నప్పుడల్లా ఈ పరిస్థితి కొన్ని ప్రదేశాల్లో ఉద్భవిస్తుంది.

డోంట్ సే గే :

క్వీర్ కమ్యూనిటీకి సంబంధించి చట్టపరమైన ఆమోదయోగ్యం లేనప్పుడు పబ్లిక్‌లో వాటిని ప్రతిబింబించే చలనచిత్రాలు, బహిరంగ ప్రదేశాల్లో దాని ఉనికి చాలా అరుదు. కాగా ఆ తర్వాత చట్టబద్ధత రావడంతో చాలా దేశాల్లోనూ వీటికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ముఖ్యంగా పిల్లలపై దృష్టి సారించే కంటెంట్‌కు సంబంధించి.. ఆయా సంప్రదాయవాద సమూహాలు ఇప్పటికీ వీటితో ఏకీభవించవు. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర సైతం 'డోంట్ సే గే' బిల్లును ఆమోదించింది. దీంతో ఇది లైంగిక ధోరణి, లింగ గుర్తింపుకు సంబంధించిన అంశాలను చర్చించకుండా, ప్రచారం చేయకుండా పాఠశాలలను నిషేధిస్తుంది. LGBTQ+ అంశాలను చర్చిస్తున్న పాఠశాలలు కనిపిస్తే తల్లిదండ్రులు ఇప్పుడు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

విరాళాలు ఆపేసిన డిస్నీ :

'డోంట్ సే గే' బిల్ పాస్ కావడంతో డిస్నీలోని సిబ్బంది వాక్-అవుట్ చేశారు. దీంతో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు అన్ని రాజకీయ విరాళాలను డిస్నీ నిలిపివేసింది. LGBTQ+ స్వచ్ఛంద సంస్థలకు $5 మిలియన్లు (£4.1 మిలియన్) విరాళంగా అందజేస్తానని ప్రతిజ్ఞ చేసింది. 'మేము ఉత్పత్తి చేసే స్ఫూర్తిదాయకమైన కంటెంట్ ద్వారా మరింత సమగ్ర ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఇది అతిపెద్ద ప్రభావాన్ని తీసుకొస్తుంది. ప్రధానంగా పిల్లలు తమ కుటుంబాలతో సినిమా చూస్తారు. రెండు పాత్రల మధ్య స్వలింగ ముద్దును చూడటం స్వీయ-గుర్తింపు కోసం చాలా ముఖ్యమైంది. ఇది విస్తృత LGBTQ+ ఆమోదానికి దోహదం చేస్తుంది. 'లైట్‌ఇయర్'లో స్వలింగ ముద్దుపై విమర్శలు అనివార్యంగా వస్తాయి, కాబట్టి LGBTQ+ విలువలకు కట్టుబడి ఉండటం ద్వారా డిస్నీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం' అని కంపెనీ సీఈవో బాబ్ చాపెక్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed