అమరావతిపై హైకోర్టు తీర్పును పరిశీలిస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి

by Disha News Web Desk |
అమరావతిపై హైకోర్టు తీర్పును పరిశీలిస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి
X

దిశ, ఏపీ బ్యూరో : రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును పరిశీలిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏనాడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి చేయడంతో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని ఈ పరిస్థితి రాష్ట్రానికి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వమని ఆది నుంచి తమ ప్రభుత్వం చెబుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబే మోసం చేశారు

అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు. అమరావతి రైతులను చంద్రబాబు నాయుడే నట్టేట ముంచారే తప్ప వైసీపీ ప్రభుత్వం కాదని విమర్శించారు. అమరావతిని భ్రమరావతిని చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్‌లు కట్టి, రాజధానిగా చంద్రబాబు ప్రచారం చేశారే తప్ప ఇంకేమైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో కుమ్మక్కై దోచుకుందని ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించేలా గత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించినట్లు ఆరోపించారు. సీఆర్‌డీఏ చట్టంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story