Stock Market: 80 వేల దిగువకు సెన్సెక్స్ పతనం

by S Gopi |
Stock Market: 80 వేల దిగువకు సెన్సెక్స్ పతనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు అమెరికా ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోత ఆశించిన స్థాయిలో ఉండదని సంకేతాలివ్వడం మదుపర్ల సెటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అలాగే, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు నిధులు వెనక్కి తీసుకెళ్లడం, కీలక బ్యాంకింగ్, రియల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వంటి అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 964.15 పాయింట్లు క్షీణించి 79,218 వద్ద, నిఫ్టీ 247.15 పాయింట్లు నష్టపోయి 23,951 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్ని షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

మరోవైపు భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతూనే ఉంది. ఇప్పటికే అమెరికా డాలర్ డిమాండ్ కారణంగా బలహీనపడిన రూపాయి మారకం, తాజాగా కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. అంతేకాకుండా తొలిసారిగా భారత రూపాయి డాలరుతో పోలిస్తే రూ. 85 స్థాయిని అధిగమించింది. తాజాగా అమెరికా ఫెడరల రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, వచ్చే ఏడాది వడ్డీ రేట్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవచ్చనే సంకేతాల కారణంగా భారత రూపాయితో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా ఫెడ్ సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో నిధుల ఉపసంహరణ, ఇతర ప్రపంచ అనిశ్చితి కారణంగా రూపాయి ప్రభావితమవుతోందని సీనియర్ బ్యాంకర్లు చెప్పారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రానికి డాలరుతో పోలిస్తే భారత రూపాయి రూ. 85.11 వద్ద ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. దేశీయంగా వృద్ధి నెమ్మదించడంతో పాటు వాణిజ్య లోటు పెరగడం, పెట్టుబడులు తగ్గడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత రూపాయిని కృంగదీస్తున్నాయి. వీటికి తోడు అమెరికా డాలర్ బలపడుతుండటం, యూఎస్ బాండ్ రాబడులు లాభదాయకంగా ఉండటం కూడా మన కరెన్సీపై ఒత్తిడి కనిపించింది. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతులపై భారం పడనుంది. ముఖ్యంగా చమురు కోసం ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తుంది.

Advertisement

Next Story