వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే 92 శాతం మరణాలు: డాక్టర్ వీకే పాల్

by Disha Desk |
వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే 92 శాతం మరణాలు: డాక్టర్ వీకే పాల్
X

న్యూఢిల్లీ: కరోనా మరణాలపై కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది‌లో సంభవించిన కరోనా మరణాల్లో 92శాతం వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ విషయాన్ని గురువారం తెలిపారు. 'తాజా మరణాలను గమనిస్తే వ్యాక్సిన్ కరోనాపై పోరాటంలో ఎంత కీలకంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో కరోనా పెద్ద ఎత్తున వ్యాపించకుండా నిరోధించడంలో టీకా రక్షించింది' అని చెప్పారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98.9 శాతం సామర్థ్యం చూపించగా, రెండు డోసులు తీసుకున్నవారిలో 99.3 శాతం సమర్ధవంతంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి 100 పరీక్షల్లో సగటున 0.99 శాతం వీక్లీ పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు సంయుక్త ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా మరణాల నమోదు ఆకస్మిక తగ్గుదల ఉందని చెప్పారు. ప్రస్తుతం 77 వేలకు పైగా క్రియాశీలక కేసులు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో 50 శాతం కేరళ, మిజోరం రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,561 కొత్త కేసులు వెలుగుచూడగా, 142 మంది వైరస్ బారిన పడి మరణించారు.


Advertisement

Next Story

Most Viewed