మేము చ‌చ్చిపోతున్నాం.. ఉక్రెయిన్లో భార‌త విద్యార్థుల‌ హృద‌య‌విదార‌క‌ వీడియో

by Nagaya |   ( Updated:2024-05-31 07:33:57.0  )
మేము చ‌చ్చిపోతున్నాం.. ఉక్రెయిన్లో భార‌త విద్యార్థుల‌ హృద‌య‌విదార‌క‌ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌లో యుద్ధం తీవ్ర‌త‌రం అవుతోంది. మ‌రోవైపు ఉక్రెయిన్‌లోని వివిధ న‌గ‌రాల్లో చిక్కుకుపోయిన భార‌తీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.ఈ క్ర‌మంలో సుమీ నగరంలో ఉన్న భారతీయ విద్యార్థుల బృందం మీడియా ద్వారా భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వీడియో సందేశం పంపారు. దాదాపు 100 మంది విద్యార్థులున్న ఈ వీడియోలో అక్క‌డ చుట్టుప‌క్క‌ల వారితో పాటు వెయ్యి మంది విద్యార్థులు ఉన్న‌ట్లు తెలిపారు. వారంతా బాత్రూమ్‌కు వెళ్ల‌డానికి, తాగ‌డానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉన్న ఆహార ప‌దార్థాలతో రోజుకు ఒక్క‌సారి తిని బ‌తుకుతున్నామని అన్నారు. ఉక్రెయిన్ నుండి స‌రిహ‌ద్దు దేశాల‌కు వెళ్లే ప‌రిస్థితుల కూడా లేక‌పోవ‌డంతో వారంతా హాస్ట‌ళ్ల‌లోనే చిక్కుకుపోయిన‌ట్లు పేర్కొన్నారు. విద్యార్థులంతా పశ్చిమ సరిహద్దుకు వెళ్లడానికి సహాయం కోసం వేడుకుంటూ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

ఇక‌, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తూర్పు ప్రాంతంలో ప్రారంభమ‌వ‌గా, ఉక్రెయిన్ రాజధాని కీవ్, తూర్పున ఉన్న రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ ప్రాంతాల నుండి వేలాది మంది భారతీయ విద్యార్థులు పోలాండ్, హంగేరీ, ఇతర పొరుగు దేశాలకు వెళ్ళగలిగారు. కానీ, వారిలో ఎక్కువ మంది త‌మ సొంత మార్గాల ద్వారా ఎన్నో క‌ష్టాలు ప‌డి, బోర్డ‌ర్ల‌కు చేరుకోగ‌లిగారు. అలా, సుమీలో ఉన్న ఈ విద్యార్థులు కూడా బ‌య‌ట‌ప‌డ‌దామ‌న్నా అక్క‌డి ప‌రిస్థితులు అనుకూలించ‌ట్లేదు. కొంద‌రు విద్యార్థులు రిస్క్ చేసి, బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత వారు కాల్పుల్లో చ‌నిపోయిన‌ట్లు వీడియోలో విద్యార్థులు వెల్ల‌డించారు. 50 కిలో మీట‌ర్ల‌లో ర‌ష్య‌న్ బోర్డ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంద‌ని, వారిని కాపాడి, ఇండియాకు త‌ర‌లించే ఏర్పాట్లు చేయ‌మ‌ని వేడుకున్నారు.

ఉక్రెయిన్ న‌గ‌రాలైన ఖార్కివ్, సుమీ, కీవ్‌లలో యుద్ధం తీవ్ర‌త‌రం అవుతుంద‌ని భారత రాయబార కార్యాలయం గత వారం హెచ్చరించింది. సుమీలో రైళ్లు, బస్సులు ఆగిపోయాయని, నగరం బ‌య‌ట‌ రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయని, వీధుల్లో సైనిక బ‌ల‌గాల యుద్ధం భారీగా జరుగుతుంద‌ని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి వాతావ‌ర‌ణంలో ఉక్రెయిన్‌లో ఉన్న నగరాల నుండి విద్యార్థులు పశ్చిమ సరిహద్దుకు ఎలా చేరుకుంటారు అనేది అతిపెద్ద ఆందోళనగా మారింది. `ఆపరేషన్ గంగా` కింద అవసరమైనన్ని విమానాల‌ను పంపుతామంటున్న భార‌త ప్ర‌భుత్వం యుద్ధ భూమిలో ఇరుక్కుపోయిన వారిని స‌రిహ‌ద్దుల‌కు చేర్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు అభ్య‌ర్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed