- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఉప్పెనలా వస్తా.. సునామి సృష్టిస్తా'.. కామారెడ్డి జిల్లా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో రైతులు పండించే ప్రతి ధాన్యం గింజను కేసీఆర్ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లేకపోతే ఉప్పెనలా వచ్చి సునామీ సృష్టిస్తానని, వేల మంది రైతులతో దుడ్డు కర్రల దండు కట్టి కేసీఆర్ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌లో 150 ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వారే రాష్ట్రంలో వరిని పండించే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేకపోతే ఫాంహౌజ్‌ను ముట్టడించి ప్రతి ఇటుకను పీకీపారేస్తామని అన్నారు.
రైతులెవ్వరూ మద్దతు ధర వస్తలేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుల పక్షాన దుడ్డు కర్రలతో సైన్యాన్ని తయారు చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎలా కొనుగోలు చేయదో తాను చూసుకుంటానని ఈ విషయంలో జరిగే ఉద్యమానికి వచ్చే ప్రతి తూటకు తగిలే లాఠీదెబ్బ తనకే తగలాలని అన్నారు. తెలంగాణలో రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని బోడి గుండుకు, మోకాలికి కేసీఆర్ మెలిక పెట్టాడని మోడీ ధాన్యం కొంటే కేసీఆర్ దళారీవా అని ప్రశ్నించారు. రెండున్నర లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 10 నుంచి 12 వేల కోట్లు వెచ్చిస్తే రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంతో కోటి ఎకరాల వ్యవసాయం చేస్తే పండించేది వరే అని తెలిసినా రైతులు పండిస్తే మాత్రం ఉరే అని కేసీఆర్ ఏ విధంగా అంటారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా రైతులకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల రైతు చట్టాలను పంజాబ్, హర్యానా రైతులు ఏ విధంగా వంద మీటర్ల లోతులో బొంద పెట్టారో అదే విధంగా ఇక్కడ రైతులను మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పిన చరిత్ర ఉందన్నారు.
2014లో ఎంపీగా కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని హామీ ఇచ్చి మరిచిన కవితను 2019 ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు. నిజామాబాద్ ప్రస్తుత ఎంపీ అర్వింద్ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మళ్ళీ నిజామాబాద్ రైతులు కర్రు కాచి వచ్చే ఎన్నికల్లో వాత పెట్టడం ఖాయమన్నారు. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బోడు గుండు రెండేళ్లయినా ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు. తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నీళ్ళను జగన్ రెడ్డికి, నిధులను మెగా కృష్ణారెడ్డికి, నియామకాలను కేసీఆర్ కుటుంబానికి అప్పజెప్పుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమం చేపట్టడంతోనే కేసీఆర్ దాన్ని డైవర్ట్ చేయడానికి సోమవారం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశాడన్నారు. మోడీ ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంతో యుద్దమంటున్న కేసీఆర్ 8 ఏళ్లలో ఎందుకు వంత పాడాడో ప్రజలకు చెప్పాలన్నారు.
తెలంగాణలో రైతులు పండించే ధాన్యం కొనుగోలు విషయంలో జరిగే పోరుకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని అన్నారు. ఎల్లారెడ్డిలో రైతులు కల్లాలపై చనిపోతే కనీసం స్థానిక ఎమ్మెల్యే నల్లికుట్ల సురేందర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంతూరు నల్లమడుగులో, ఐలాపూర్‌లో రైతులను పరామర్శించి ఆదుకుందని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మహామహులను కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టసభలకు పంపిన ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న కాయితి లంబాడీలను ఎస్టీలలో చేర్చే అంశాన్ని, పోడు భూములకు పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడంట్లు అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, బలరాంనాయక్, సుదర్శన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, సౌదాగర్ గంగారాం, బెల్లయ్య నాయక్, సురేష్ షట్కార్, ఈరవత్రి అనిల్, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి కల్వకుంట్ల మధన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి ఇంచార్జి వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.