ఈ కేఫ్‌కి వెళ్లారంటే ప‌ని పూర్త‌య్యేదాక వ‌ద‌ల‌రు! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-10 17:05:18.0  )
ఈ కేఫ్‌కి వెళ్లారంటే ప‌ని పూర్త‌య్యేదాక వ‌ద‌ల‌రు! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ర‌చ‌న ఏదైనా దాన్ని డెడ్‌లైన్‌లో పూర్తిచేయాలంటే హ‌డావిడీ గంద‌ర‌గోళమే. రోజువారీ ప‌నుల్లో ప‌డి రాయ‌డానికి తీరిక దొర‌క్క ఇబ్బందిప‌డుతుంటారు చాలా మంది ర‌చ‌యిత‌లు. స‌రిగ్గా ఇలాంటి వారి కోస‌మే జ‌పాన్‌లోని టోక్యోలో ఒక కేఫ్ ప్రారంభించారు. ఈ 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కేఫ్‌'లో ఎలాంటి ర‌చ‌న‌లైనా చేయొచ్చు. ఇంక రాయ‌లేనులే అని, ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌ట‌కు రాడానికి వీల్లేదు. ఒక్క‌సారి ఈ కేఫ్‌లోకి ఎంట‌రైతే ముందు చెప్పిన ప్ర‌కారం అంతా పూర్తిచేయాలి. అంటే, కేఫ్‌లోకి వెళ్లే ముందే ఏం రాయ‌డానికి వెళ్తున్నారు, ఎంత సేప‌ట్లో పూర్తిచేస్తారు, మీ టైమ్ గురించి ఎప్పుడెప్పుడు గుర్తుచేయాలి అనే వివ‌రాల‌ను రాసివ్వాలి. అంతే, ఇక మీరు రాసేది పూర్త‌య్యే వ‌ర‌కూ ఈ కేఫ్ సిబ్బంది మిమ్మ‌ల్ని మృదువుగానే ప‌ట్టి పీడిస్తారు!

పశ్చిమ టోక్యోలో ఉన్న 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కేఫ్‌' శుభ్రంగా, బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంటుంది. క‌స్ట‌మ‌ర్ ఉన్నంత సేపు అప‌రిమితంగా కాఫీ, టీలు తాగొచ్చు. ఇక్క‌డున్న 10 సీట్ల‌లో ప్రతి సీటు వద్ద హై-స్పీడ్ వైఫై, డాకింగ్ పోర్ట్‌లు ఉంటాయి. రాసే స‌మ‌యంలో ప్రతి గంటకు చెక్-ఇన్ ఉంటుంది. ఈ కేఫ్‌లో రెండు కోర్సులు ఉంటాయి. ఒక‌టి "మృదువైన‌ది". రెండోది, "కఠినం", దీన్ని ఎంచుకుంటే రాయ‌డం పూర్త‌య్యే వ‌ర‌కూ ఓ వ్య‌క్తి తమ వెనుక నిలబడి నిశ్శబ్దంగా ఒత్తిడి పెంచుతాడు. ఇలా డెడ్‌లైన్‌లో రాయ‌డం పూర్త‌వుతుంది.

కేఫ్ యజమాని త‌కుయా క‌వై (52) స్వయంగా రచయిత కావ‌డంతో ర‌చ‌న‌లు చేయ‌డానికి ఎలాంటి వాతావ‌ర‌ణం కావాల‌నేదానిపై క‌చ్ఛిత‌మైన అభిప్రాయాలున్నాయి. అందుకే, ఇలాంటి కఠినమైన నియమాలు మ‌నం చేసే ప‌నిపైన దృష్టి పెట్టడంలో సహాయపడతాయని అంటాడు. ఇక‌, ఇప్ప‌టికే తమ టాస్క్‌లను పూర్తి చేసి వెళ్లిపోయిన కస్టమర్ల పేర్లతో కూడిన బోర్డు కూడా ఇక్క‌డ ఉంటుంది. ఈ కేఫ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజన్ల నుండి విభిన్న స్పంద‌న‌లు వెలువ‌డ్డాయి. అయితే, కేఫ్‌లో ర‌చ‌యిత‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండ‌టం వారి ప‌నిని పూర్తిచేయ‌డానికి ఇస్తున్న మ‌ద్ద‌త‌ని త‌కుయా చెబుతారు. దాని వ‌ల్ల‌, రాయాల‌నుకున్న‌ది ఒక రోజులో కాకుండా మూడు గంటల్లో పూర్తిచేయొచ్చ‌ని అంటారు.

Advertisement

Next Story

Most Viewed