ఈ యుద్ధాలు ప్రపంచ సంక్షోభానికి సంకేతాలు..

by Javid Pasha |
ఈ యుద్ధాలు ప్రపంచ సంక్షోభానికి సంకేతాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా కేపిటల్‌పై ట్రంప్ అనుచరుల దాడి, ఇథియోపియాలో దారుణమైన రక్తపాతం, ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ విజయం, ఉక్రెయిన్, తైవాన్‌లలో అమెరికా పేరాశలు, కోవిడ్-19 మృత్యు హేల, వాతావరణ అత్యవసర పరిస్థితి వంటివి గమనించాక ప్రపంచం మరోసారి పట్టాలు తప్పుతోందనిపించక మానదు. 2021 లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే యుద్ధ మరణాల సంఖ్య తగ్గిందని పైకి కనిపించవచ్చు. అలాగే యుద్ధజ్వాలల్లో చిక్కుకుపోయి ప్రపంచం దగ్ధమయ్యే స్థితి కూడా లేదని పైకి కనిపించవచ్చు. కానీ 2022లో మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలను గమనిస్తే ప్రపంచం అతి సులభంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది.

పౌరుల మరణాలు పెరుగుతున్నాయి

గత పాతికేళ్ల యుద్ధ ఘటనలను చూస్తే ప్రపంచయుధ్ధాలలో జరిగినంత అధికంగా సైనికుల మరణాలు సంభవించలేదన్నది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎమెన్‌ ఘర్షణల్లో వేలాదిమంది అమాయక పౌరులు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లల సంఖ్యే ఎక్కువ. సైనిక దాడుల్లో కావచ్చు, ఆకలి దప్పులు బారిన పడి కావచ్చు ఇథియోపియా అంతర్యుద్ధ కాలంలో లక్షలాది మంది పశ్చిమ దేశాల విధానాల కారణంగా చనిపోయారు. వీరిలో పిల్లల సంఖ్యే ఎక్కువ. యుద్ధం కారణంగా నిరాశ్రయులవుతున్న వారి సంఖ్య అత్యధికంగా నమోదవుతోంది. యుద్ధమరణాలు తక్కువ, యుద్ధ బాధితుల వ్యధలు చాలా ఎక్కువగా ప్రపంచ గమనం సాగుతోంది.


1990లలో బోస్నియా, రువాండా, సోమాలియా తదితర దేశాల్లో జరిగిన జాతి హత్యాకాండ, ఊచకోత ఘటనలు, శ్రీలంకలో ఎల్టీటీఈతో పాటు తమిళులపై లంక సైన్యం సాగించిన మారణకాండ వంటివి ఇప్పుడు లేవని మనం సమాధానపడవచ్చు కానీ 45 రోజులుగా సాగుతున్న యుద్ధ కాలంలో అరకోటి మంది జనం ఉక్రెయిన్‌లో నిరాశ్రయులై వలసపోయారు. ఇది యుద్ధాన్ని మించిన బీభత్సమే. యుద్ధ మరణాలు మనకు చెప్పే కథ చాలా చిన్న భాగం మాత్రమే. కానీ అమెరికా ప్రేరేపిత చర్యల కారణంగా యెమెన్‌లో, ఇథియోపియాలో, ఆఫ్రికాలోని పలుదేశాల్లో వేలాదిమంది సైనికులు చనిపోయారు అదే సమయంలో లక్షలాదిమంది మహిళలు, చిన్నపిల్లలు, ఆకలిదప్పులతో, వ్యాధులతో చనిపోయారు. 2021లో తాలిబన్ల చేతికి చిక్కిన ఆప్ఘనిస్తాన్‌లో హింస, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పైకి కనిపిస్తున్నా గత దశాబ్దాల్లో పోరాటంలో మరణించిన వారి సంఖ్య కంటే ఇప్పుడు అక్కడ లక్షలాదిమంది మహిళలు, పిల్లలు మృత్యుకోరల మధ్య చిక్కుకుని ఉండటం వాస్తవం.


ప్రమాదకరంగా తాజా పరిణామాలు

గతంలో కానీ, ఇప్పుడు కానీ అగ్రరాజ్యాల ప్రయోజనాల మధ్య తగవులే ప్రపంచ దేశాల్లో సంక్షోభాలకు కారణమవుతున్నాయి. అమెరికా బలం తగ్గిపోతోందని అర్థమవుతున్నప్పటికీ, ఈరోజుకీ ప్రపంచం నలుమూలలకూ సైన్యాలను తరలించగల దాని సామర్థ్యం తగ్గలేదు. నాటో కూటమి సైనిక మోహరింపులు, ఆసియా దౌత్యం పేరుతో అమెరికా చేస్తున్న తాజా ప్రయత్నాలు అన్నీ ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకుపోయే సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్, తైవాన్, ఇరాన్ అన్నీ అగ్రరాజ్యాల బలాల సమతుల్యతా పోరాటంలో భాగమే. గత రెండేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి పాతిక లక్షలమందికి పైగా జనాభాను హరించివేసింది. దారిద్ర్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయింది. జీవన వ్యయాలను పెంచేసింది. అసమానత్వం, నిరుద్యోగం వంటివాటి కారణంగా ప్రజాగ్రహం ఆయా దేశాల ప్రభుత్వాలపై వెల్లువెత్తుతోంది. కానీ అంతకు మించి టునిషియా, సూడాన్, కొలంబియా వంటి దేశాలు కోవిడ్‌కి మించిన నష్టాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జరుగుతున్న పరిణామాలు ప్రపంచ సంక్షోభానికి కొత్త దారులు వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022లో ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కొన్ని ప్రధాన ఘర్షణలను చూద్దాం.


1. ఉక్రెయిన్

2014 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన ఘర్షణలు పుతిన్ దూకుడు చర్యలతో 2022 నాటికి స్పష్టంగా యుద్ధరూపం దాల్చాయి. మాస్కో అనుకూల ప్రభుత్వాన్ని కూల్చి జెలెన్ స్కీని పశ్చిమదేశాలు నిలబెట్టడంతో పుతిని ఉగ్రుడైపోయారు. దీంతో క్రిమియాను కలుపుకోవడం నుంచి మొదలై డోన్‌బాస్ రీజియన్‌ని ఉక్రెయిన్ నుంచి వేరుపర్చడం దాకా సాగిన అనేక పరిణామాల అంతిమరూపమే ఇప్పుడు ఈ రెండుదేశాలకు మధ్య యుద్ధంగా మారింది. పరిమిత సైనిక చర్యగా మాత్రమే భావించిన ఈ ఘర్షణ రెండో ప్రపంచ యుద్ధానంతరం కనీవినీ ఎరుగనంత అధిక సంఖ్యలో అరకోటి జనాభాను శరణార్థులుగా మార్చేసింది. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి లాక్కోవడానికి పాశ్చాత్య దేశాలు పన్నిన పన్నాగాలు అంతిమంగా అక్కడ సరికొత్త యుద్ధాన్ని, విధ్వంసాన్ని సృష్టించాయి.

2. ఇథియోపియా

రెండేళ్లక్రితం శాంతి నెలకొన్నట్లు కనిపించిన ఇథియోపియాలో ప్రభత్వ బలగాలకు, ఉత్తరాదిన టిగ్రీ రీజియన్‌కు మధ్య సంవత్సరకాలంగా జరుగుతున్న పోరు దేశాన్ని, జనజీవితాన్ని ఛిద్రం చేసిపడేసింది. ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు దారుల దాడుల మధ్య ప్రజలపై హింసాకాండ కనీవినీ ఎరుగనంతగా పెరిగింది. దేశంలో మళ్లీ శాంతి నెలకొంటుందన్న ఆశ లేశమాత్రంగా కూడా అక్కడ కనిపించడం లేదు.


3. ఆఫ్ఘనిస్తాన్

2021 మధ్యలో అమెరికా బలగాలు శాశ్వతంగా నిష్క్రమించడంతో దశాబ్దాల అస్థిరత్వం నుంచి ఆప్ఘనిస్తాన్ బయటపడుతుందని అందరూ భావించారు. కానీ అమెరికా, పాశ్చాత్య దేశాల సహాయ నిరాకరణతో ఇప్పుడు ఆ దేశం అతిపెద్ద మానవతావాద సంక్షోభంలో కూరుకుపోయింది. లక్షలాది ఆప్ఘన్ పిల్లలు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి డేటా సూచిస్తోంది. ఆప్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏదయినా ఉందా అంటే అది ఆప్ఘాన్లను తమమానాన తమను చావనివ్వడమే. పాశ్చాత్య దేశాలు చేసిన తప్పిదాలన్నింటికీ ఆప్ఘానిస్తాన్ నేడు సాక్షీభూతమై నిలుస్తోంది.

4. యెమెన్

2021లోనే యెమెన్ పతాక శీర్షికలలో కనిపించడం తగ్గిపోయింది కానీ అక్కడ అగ్రరాజ్యాల జూదం కారణంగా జరిగిన విధ్వంసం ఇప్పటికీ ఆ దేశాన్ని వెంటాడుతోంది. దానికి తోడు హౌతీ తిరుగుబాటుదారులు చమురు గ్యాస్‌తో సమృద్దిగా ఉన్న ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. తిరుగుబాటుదారులు, ప్రభుత్వ బలగాల దయాదాక్షిణ్యాల మధ్య యెమెన్ ప్రజలు నలిగిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అక్కడ ఎవరు గెలిచినా, ఓడినా జనజీవితాలు తల్లకిందులు కావడం ఖాయమనిపిస్తోంది.

5. మయన్మార్

2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక కుట్ర నాటి నుంచి దేశంలో జరుగుతున్న శాంతియుత ప్రదర్శనలన్నింటిపై మయాన్మార్ సైనిక నాయకత్వం ఉక్కుపాదం మోపింది. సైనిక పదఘట్టనల మధ్య నలుగుతున్న దేశం ఇప్పుడు సహాయ నిరాకరణ నుంచి సైనిక బలగాలపై దాడుల వరకు మండుతోంది. నివురు గప్పిన నిప్పులా మయాన్మార్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. ఆంగసాన్ సూకీ ప్రజాబలాన్ని తేలిగ్గా తీసుకున్న సైనిక నాయకత్వం ప్రజల నిరసనను అణచివేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పాలిస్తోంది. మయన్మార్ ఇప్పుడు శాంతికి ఆమడల దూరంలో ఉంది.

6. ఆఫ్రికాలో ఇస్లామిస్ట్ మిలిటెన్సీ

2017లో మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ స్టేట్ తన ప్రాభవాన్ని కోల్పోయినప్పటి నుంచి ఆఫ్రికా ఖండం ప్రభుత్వాలకు, జిహాదిస్టులకు మధ్య చరిత్ర కనీవినీ ఎరుగని సమరాల మధ్య నలిగిపోతోంది. ఇప్పుడక్కడ ఇస్లామిక్ స్టేట్‌కి అల్‌ఖాయిదాకు మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రభుత్వాలను కూల్చే పనిని మరింత సమర్థంగా వారు చేపట్టనున్నారని భావిస్తున్నారు. ఆప్రికాలో ఇప్పుడు రక్తమోడని ప్రాతం అంటూ లేదు.

Advertisement

Next Story