క్యాన్సర్‌కు భయపడాల్సిన పనిలేదు: డాక్టర్ నోరి దత్తాత్రేయ

by Mahesh |
క్యాన్సర్‌కు భయపడాల్సిన పనిలేదు: డాక్టర్ నోరి దత్తాత్రేయ
X

దిశ, అంబర్ పేట్: క్యాన్సర్‌కు భయపడాల్సిన పనిలేదని ప్రాథమిక దశలోనే గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని అంతర్జాతీయ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్, పరిశోధకులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. డాక్టర్ నోరి దత్తాత్రేయ రచించిన స్వీయ ఆత్మకథ "ఒదిగిన కాలం" గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 400 గ్రంధాలయాలకు బహుకరించారు. శనివారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ కు రచయిత గ్రంథాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పనిలేదని ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చికిత్స అందించవచ్చని తెలిపారు.ఆడవాళ్లకు వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా మొదటి దశలో గుర్తించి నివారించే చర్యలు చేపట్టవచ్చునని తెలిపారు. తాను హైదరాబాదులో వైద్య విద్యను చదువుకున్నానని, అమెరికా వెళ్లి తాను నేర్చుకున్న పరిశోధనా ఫలాలను తిరిగి ఈ నేలకే అందించి కృతజ్ఞత చెల్లించుకోవాలన్నదే తన తపన అన్నారు. ఆధునిక క్యాన్సర్ చికిత్స ఇమినో థెరపీని సామాన్యులకు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు.

సమావేశంలో జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఆధునిక భవనాలను నిర్మించి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రంథాలయాలకు దాతలు పుస్తకాలను బహూకరించే సంస్కృతి మంచిదని, ఈ సంస్కృతి మరింత విస్తరించాలని కోరారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో ఉన్న గ్రామీణ గ్రంథాలయాలకు విరివిగా పుస్తకాలను అందించే పనిని ముమ్మరం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మన ఊర్లలోని గ్రంథాలయాలను మరింత శక్తివంతం చేసుకునేందుకు వాటిని డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్దుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed