పేదల భూమి కబ్జా.. కలెక్టర్ సందర్శించినా బెదరని టీఆర్ఎస్ లీడర్

by GSrikanth |
పేదల భూమి కబ్జా.. కలెక్టర్ సందర్శించినా బెదరని టీఆర్ఎస్ లీడర్
X

దిశ, రఘునాథపల్లి: భూదాన్‌ భూములను అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. అసైన్‌మెంట్‌ చేసిన భూదాన్‌ భూములను వారసత్వంగా అనుభవించాలే గాని కానీ, ఇతరులకు అమ్మడానికి వీలుండ‌దు. అసైన్‌మెంట్‌ భూ బదలాయింపు నిషేధిత చట్టం 1977 ప్రకారం అసైన్డ్‌ భూముల కొనుగోలు కూడా చెల్లదని నిబంధ‌న‌ల్లో స్పష్టంగా ఉంది. అయితే, ఈ నిబంధ‌న‌ల‌ను ఓ టీఆర్ఎస్ నేత తుంగలో తొక్కారు. కొంతమంది రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతో జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథ‌ప‌ల్లి మండ‌లం మేక‌ల‌గ‌ట్టు గ్రామంలోని భూదాన్ భూములు క‌లిగి ఉన్న రైతుల నుంచి భూ ముల‌ను క‌బ్జా చేశాడు. భూ రికార్డులను చెరిపి మ‌రో రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు భూదాన్ భూములను విక్రయించాడు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు వీటిని దర్జాగా కబ్జా చేసి రియల్ వెంచర్లుగా మారుస్తున్నారు. వీరికి రెవెన్యూ, పంచాయ‌తీ అధికారులు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నార‌నే ఆరోపణలు ఉన్నాయి.

భ‌యపెట్టి.. కబ్జా

మండలంలోని మేకలగట్టు గ్రామంలో సర్వే నంబర్ 206లో మొత్తం 120 ఎకరాల భూదాన్ భూములున్నాయి. 1975లో భూదాన్ ఉద్యమంలో భాగంగా కొందరు భూస్వాములు సదరు భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. అప్పట్లో ఈ 120 ఎకరాల భూమిని ప్రభుత్వం స్థానిక దళిత, గిరిజన రైతులకు కేటాయించింది. అప్పటి నుంచి ఆ భూములను వారు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో భూముల ధ‌ర‌ల‌కు రెక్కలు రావడంతో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి రైతుల నుంచి ఆ భూములను బలవంతంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. తమ భూములు ఇవ్వబోమని కొందరు మొండికేసినా.. భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి త‌న దారికి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చేసేందేమీ లేక ఆ భూములను ఆ నేత‌కు అప్పగించిన‌ట్లు స‌మాచారం. స‌ద‌రు నేత భూదాన్ భూముల‌ను ఓ రియల్ వెంచర్‌గా మార్చేసి విజయవాడకు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టి కోట్లాది రూపాయలు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఆందోళ‌న‌ల‌తో వెలుగులోకి..

ఓ దళిత రైతు సదరు అధికార పార్టీ నాయకుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు నాయకుడిపై పోలీసులు అట్రాసిటీ కేసు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో రఘునాథపల్లికి చెందిన మేకల వరలక్ష్మి, జెడ్పీటీసీ బొల్లం అజయ్‌లు ఈ భూముల వెనక ఉన్న అసలు మర్మమేమిటి? వీటిని కొనుగోలు చేసింది ఎవరు? తిరిగి ఆ భూములను వారికే ఇప్పించాలంటూ నిరసనకు దిగారు. దీంతో సదరు భూములపై నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు వారం రోజుల క్రితం భూదాన్ భూములను సందర్శించి విచారణ చేపట్టారు. అయినా రైతులకు న్యాయం జరగలేదు.

పంచరాయి భూములది అదే తీరు!

ఓవైపు మేకలగట్టు గ్రామంలోని భూదాన్ భూమి వివాదం కొనసాగుతుండగా మరోవైపు మల్లంపల్లి గ్రామానికి చెందిన రైతులు కూడా తమ భూములను కొందరు ఆక్రమించారని కోర్టు మెట్లెక్కారు. మల్లంపల్లిలోని సర్వే నంబర్ 197లోని పంచ రాయి భూమి కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 30 ఎకరాల భూమి ఉండగా, కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి పంచరాయి భూమిని కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారు. కబ్జా చేయడమే కాకుండా ఇలాంటి ప్రెసిడెంట్, ఇతర రికార్డు లేకుండా ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలను పొంది స్థానిక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో అధికారులు భూ ఆక్రమణ దారుడికి వత్తాసు పలుకుతూ తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మండలంలో ఓవైపు భూదాన్ భూములు, మరోవైపు పంచరాయి భూములు అన్యాక్రాంత అవుతున్న స్పందించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం విచారకరం. మేకలగట్టు భూదాన్ భూములు, మల్లంపల్లి పంచరాయి భూమి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు తక్షణమే దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మేకలగట్టు సహా ఇతర గ్రామాల్లో రియల్ వ్యాపారులు రైతుల నుండి లాక్కున్న భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర బుధవారం కలెక్టరేట్‌కు చేరుకుంది. ఇకనైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed