- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌కు దూరంగా జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో మరో దుమారం..!!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ల మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. రేవంత్ వ్యతిరేక వర్గం కలిసి రావడం లేదు. దీని ప్రభావం పార్టీ కార్యక్రమాలపై పడుతోంది. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించిన ఆయన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ, టీపీసీసీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనలేదు. అంతేకాకుండా గాంధీభవన్‌కు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన కీలక సమావేశానికి సైతం జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు ఆయనను ఆహ్వానిస్తే.. తాను రానని స్పష్టం చేసినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. తాజాగా అసెంబ్లీ హాల్ లో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో జగ్గారెడ్డి పార్టీతో సంబంధం లేదన్నట్టుగా.. ఆఖరి సమయంలో ఒంటరిగా వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. దసరా వరకు ఆయన గాంధీభవన్ మెట్లు ఎక్కరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
నాతోనే ప్రాబ్లమైతే వెళ్లిపోతా..
పార్టీ విషయాలపై ఇక నుంచి మాట్లాడకూడదని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ, టీఆర్ఎస్ విషయంలోనూ మౌనంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడుతుండడంపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి జగ్గారెడ్డి గాంధీభవన్ వైపు వెళ్లడమే మానేశారు. అటు సీఎల్పీకి కూడా వెళ్లడం లేదు. క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా గోడకేసి కొడతానని రేవంత్ అనడంతో.. అంతే స్థాయిలో జగ్గారెడ్డి స్పందించారు. గోడకేసి కొట్టడానికి నువ్వెవరివంటూ ప్రశ్నించారు. చివరకు ఈ వివాదం సంచలన నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటించే వరకు వెళ్లింది. మళ్లీ ఏం జరిగిందో జగ్గారెడ్డి సైలెంట్ అయ్యారు. అయితే జగ్గారెడ్డిపై చర్యల కోసం రేవంత్ అంతర్గతంగా పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సంగారెడ్డిలో ముఖ్యనేతల సమావేశంలో జగ్గారెడ్డి బావోద్వేగానికి గురయ్యారు. తనవల్లే ప్రాబ్లమ్ అయితే వెళ్లిపోతానని, తనను కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగ్గారెడ్డి అనుచరుల లీకులను బట్టి దసరా వరకు ఆయన గాంధీభవన్ మెట్లు ఎక్కరని స్పష్టమవుతోంది. సంగారెడ్డిలో ఏటా భారీగా దసరా వేడుకలు నిర్వహించే జగ్గారెడ్డి.. ఆ వేడుకల్లో కీలకమైన నిర్ణయం ప్రకటిస్తారని చర్చ జరుగుతుంది. పార్టీ నాయకులు, అనుచరులకు కు సైతం ఇదే చెప్పారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో దుమారం
ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. టికెట్ల అంశంపై ఇప్పుడే ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో సహా సీనియర్లు ప్రకటిస్తుంటే, జడ్చర్లలో టికెట్ అనిరుధ్ రెడ్డికే ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని కోమటిరెడ్డి చెప్పడం పార్టీలో చర్చకు దారితీసింది. అనిరుద్ కష్టపడుతున్న తీరుతో అధిష్టానం సైతం సానుకూలంగా స్పందిస్తుందని, పార్టీని నమ్ముకున్న వారికి కాంగ్రెస్ అన్యాయం చేయదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు వేరే చోటు చూసుకోవాలని చెప్పడం గమనార్హం. అయితే ఇటీవల ఈ నియోజవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో తాజాగా కోమటి రెడ్డి జడ్చర్ల టికెట్ ను అనిరుధ్ రెడ్డికే దక్కేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని హామీ ఇవ్వడం చర్చకు దారితీసింది.
రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా?
విభేదాలు లేవంటూ సీనియర్లు చెప్పుకుంటున్నా.. లోలోపల నేతల మధ్య సఖ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ ను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆయన చేరిక సమావేశానికి సైతం గాంధీ భవన్ కు రాలేదు. గతంలో టీడీపీలో పని చేసిన పరిచయంతో రేవంత్, ఎర్ర శేఖర్ కు మంచి అనుబంధం ఉందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఎర్ర శేఖర్ ను వ్యతిరేకిస్తున్న కోమటి రెడ్డి ఇప్పుడు జడ్చర్ల అసెంబ్లీ టికెట్ అనిరుధ్ రెడ్డికే ఖాయం అవుతుందని చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యం అనే టాక్ వినిపిస్తోంది.