- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CLP లీడర్ భట్టి విక్రమార్క ప్రతిష్ట మసకబారిందా?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి ప్రతిష్ట మసకబారుతుందా..? వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందా..? సీఎల్పీ నేత అయి ఉండి.. కేవలం తన నియోజకవర్గంలోనే పాదయాత్ర చేయడానికి కారణాలేంటి..? తర్వాత రాష్ట్రం మొత్తం చేస్తానన్నా.. మొదట తన నియోజకవర్గంలోనే ఎందుకు? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి చూస్తుంటే.. ఇప్పటి నుంచే అడ్డుకునేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి దాపురించిందంటున్నారు. సీనియర్లు అయి ఉండి ఎవరికివారే యమునాతీరేలా నియోజకవర్గానికి పరిమితమవుతున్నారు. ఇగోలకు పోతున్నారు. వెరసి ఎంతో చరిత్ర ఉన్న పార్టీని కప్పదాట్ల కాంగ్రెస్ అనే పేరు తెస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో ఎందుకు..?
భట్టి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరుతో 32 రెండు రోజులపాటు సుమారు 500కి.మీ మేర భారీ షెడ్యూల్‌నే ఏర్పాటు చేసుకున్నారు. ఉగాది నాటికి భట్టి చేపట్టిన పాదయాత్ర 16 రోజులకు చేరుకోగా.. దాదాపు 250 కిలోమీటర్ల యాత్ర చేశారు. అయితే ఇది స్థానిక అనుచరులకు బాగుందనే అనిపించినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మాత్రం రుచించడం లేదు. సీఎల్పీ నేత అయి ఉండి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి తప్ప.. పీసీసీ చీఫ్‌కు సహకరించకుండా సొంతంగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఇలా చేస్తే రాష్ట్రస్థాయిలో తనకున్న ఇమేజ్ తగ్గిపోతుందనే మెజార్టీ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
సొంత జిల్లాలోనే అప్రదిష్ట..
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భట్టి విక్రమార్క సీఎం క్యాండిడేట్‌గా ముందుంటారేమో? లేదా మంచి ప్రియారిటీ దక్కవచ్చేమో? అలాంటిది తన సొంత జిల్లా ఖమ్మంలో ఏకంగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న సందర్భంలో నిలువరించలేకపోయారనే అప్రదిష్ట పాలయ్యారు. ఒకప్పుడు ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారపార్టీకి సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. మధిర, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచారు. అయితే కొత్తగూడెం, పినపాక, పాలేరు, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియానాయక్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా వారిని భట్టి ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. పోయినసారి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం హడావుడి చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. పార్టీ చతికిల పడ్డట్టయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేసిన అభ్యర్థికి ఖమ్మం జిల్లాలో భట్టి వర్గం ఏమాత్రం సహకరించలేకపోయింది. ఇదే విషయాన్ని ఆయన ప్రెస్‌మీట్లు పెట్టి ఎన్నోసార్లు చెప్పుకున్నారు కూడా.
భట్టికి భయం పట్టుకుందా..?
సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. అందుకే సొంత నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేస్తోంది. పార్టీలో ఎలాగూ తనకు ప్రతికూల వాతావరణమే ఉన్నందున కనీసం గెలవలేకపోతే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌లో భట్టి చేరుతున్నారనే ఊహాగానాలు గతంలో వచ్చాయి కూడా. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో అందుకే పలుమార్లు భేటీ అయ్యారని కూడా కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. తనవల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగకపోయినా తనను తాను గెలిపించుకుంటే అయినా అప్పటి పరిస్థితులను భట్టి వేరే పార్టీలోకి అయినా వలస పోవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే 500కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారనే ఊహాగానాలు అందుకున్నాయి.
భట్టికి విషమ పరీక్షే..
టీపీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది. ఒకానొక సందర్భంలో భట్టిని ఆ పదవి వరించనుందని అందరూ అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆశలు నిరాశలుగా మారాయి. తర్వాత రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే భట్టికి అప్పుడున్న క్రేజ్ లేదని.. ఆయనను పీసీసీగా చేస్తే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనే నివేదిక ఢిల్లీ పెద్దలకు అందినట్లు సమాచారం. తన సొంత జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని, మిగతా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏమాత్రం పనిచేయలేదని ఫిర్యాదులు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు.. తాను టీఆర్ఎస్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నట్లుగా కూడా చెప్పారట. ఈ కారణంతోనే ఆయనకు పీసీసీ పదవి దక్కలేదని కాంగ్రెస్ శ్రేణుల్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఎంత చేసే నియోజకవర్గ పాదయాత్ర ఆయన ఇమేజ్‌ను ఏమాత్రం పెంచదు అంటున్నారు పార్టీ కార్యకర్తలు. సీఎల్పీ స్థాయి నాయకుడు రాష్టస్థాయి నేతలందరితో కలుపుకుపోవాలని.. అలాంటిది ఎవరిదారి వారే చూసుకుంటున్నారని కాంగ్రెస్ వీరభిమానులు మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు.
విక్రమార్క కారెక్కేనా..?
గతంలో కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్కదే హవా.. రేవంత్ రాకతో ఆయనకు బ్రేక్ పడ్డటయింది. రేవంత్ వచ్చీ రాగానే భట్టిపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందినట్లు ప్రచారం జరిగింది. ఒకానొక దశలో సీఎల్పీ నుంచి కూడా తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో భట్టి ఎలాగైనా సరే వచ్చి ఎన్నికల్లో తాను గెలిస్తే వేరే అవకాశాలు ఉంటాయనే ఆయన చేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ కాంగ్రెస్‌లో తన మాట నెగ్గే పరిస్థితి లేనందున పాదయాత్ర కొంత వరకు గెలుపునకు దోహదం చేస్తుందని ఆయన అనుచరులే అంటున్నారు. ఏది ఏమైనా భట్టి పాదయాత్ర లక్ష్యం నెరవేరుతోందో లేదో చూడాలి మరి..