Murder case : ఓ పెండ్లి పత్రిక.. 26 ఏళ్ల క్రితం హత్య కేసు నిందితుడిని పట్టించింది!

by Y. Venkata Narasimha Reddy |
Murder case : ఓ పెండ్లి పత్రిక.. 26 ఏళ్ల క్రితం హత్య కేసు నిందితుడిని పట్టించింది!
X

దిశ, వెబ్ డెస్క్ : నేరస్థుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఎక్కడో ఏదో ఒక పొరపాటుతో పోలీసులకు చిక్కడం చూస్తుంటాం. అయితే ఓ హంతకుడు(Murder case)నేరం చేసిన 26ఏండ్లకు ఓ పెండ్లి పత్రిక(wedding magazine) ఆధారంగా పోలీసులకు చిక్కిన ఘటన వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రత్న వెల్లడించారు. పుట్టపర్తి రూరల్ గుడిబండ మండలం దిన్నేహట్టికి చెందిన తిప్పేస్వామి.. భార్య కరియమ్మలకు ఇద్దరు సంతానం. భార్యపై అనుమానంతో చిన్నకుమారుడు శివలింగయ్య (6నెలలు) తనకు పుట్టలేదని భావించిన తిప్పేస్వామి.. పసికందును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. 1998 అక్టోబరు 2వ తేదీన ఉదయం దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దిన్నేహట్టి సమీప పొలాల్లోని మారెమ్మ జమ్మికట్టకు ప్రదక్షిణ చేద్దామని భార్య, కుమారుడిని పిలుచుకెళ్లాడు. కుమారుడు శివలింగయ్యను ఎత్తుకుని కరియమ్మ ప్రదక్షిణ చేస్తుండగా తిప్పేస్వామి పిల్లవాడిని లాక్కుని పరారయ్యాడు. తన మామిడితోటలోకి వెళ్లి చిన్నారిని గొంతునులిమి చంపేశాడు. అక్కడే గొయ్యితీసి, పాతిపెట్టి పారిపోయాడు. 1998 అక్టోబరు 18న గుడిబండ పోలీసుస్టేషన్ లో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతకాలంగా పోలీసులు నిందితుడ్ని పట్టుకోలేకపోయారు.

కుమారుడిని చంపి పరారైన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లా ఆర్దురు గ్రామానికి చేరుకున్నాడు. జవారప్ప వద్ద కృష్ణగౌడ్‌గా పేరు మార్చుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన తార అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తులసి, సౌమ్య ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే తిప్పేస్వామి స్వగ్రామం దిన్నేహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్‌ బాంబే నాగరాజుతో రహస్యంగా స్నేహం కొనసాగిస్తు అప్పడప్పుడు ఊళ్లోని విషయాలు ఆరా తీసేవాడు. తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడు అయ్యాడనీ, మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని బెంగుళూరుకు వెళ్లిపోయిందనీ, కొడుకును చంపిన విషయం గ్రామస్తులంతా మరచిపోయారనీ, పోలీసుల కేసు కూడా లేదని నాగరాజు చెప్పాడు. ఊరికొచ్చి భూమి భాగం పరిష్కారాలు చేసుకోవాలని తిప్పేస్వామికి సలహా ఇచ్చాడు.

ఈ క్రమంలో తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణగౌడ నాలుగునెలల క్రితం తన చిన్న భార్య తార కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను నాగరాజుకు పంపాడు. నాగరాజు, అతడి భార్య న్యామనహళ్లిలో వివాహానికి హాజరై వచ్చారన్న విషయం గ్రామస్థులకు తెలిసింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్పీ రత్న.. పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు నాగరాజును విచారించి ఇంట్లో తనిఖీ చేసి పెళ్లి పత్రికను సేకరించారు. నాగరాజు సలహా మేరకు భూముల భాగపరిష్కారం కోసం సోమవారం తన తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కంచమ్మతో పెద్దమనుషుల ద్వారా మాట్లాడడానికి మందలపల్లికి వెళ్లేందుకు దిన్నేహట్టి బస్టాండు వద్దకు తిప్పేస్వామి చేరుకుంటాడన్న సమాచారంతో మడకశిర సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ మునిప్రతాప్‌.. సిబ్బందితో కలిసి వలపన్ని అతడిని పట్టుకున్నారు. 26 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న తిప్పేస్వామి అలియాస్‌ కృష్ణగౌడను చాకచక్యంగా పట్టుకున్న పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌, సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. రివార్డులను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed