హత్యనా..? ప్రమాదమా..? అసలు అక్కడ ఏం జరిగింది

by Mahesh |   ( Updated:2022-03-15 09:16:25.0  )
హత్యనా..? ప్రమాదమా..? అసలు అక్కడ ఏం జరిగింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మంజీరా నది ఇసుక క్వారీ ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం మంజీరా నదిలోని రెండవ ఇసుక క్వారీ పాయింట్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హద్ అనే వ్యక్తి తన లారీలో ఇసుక తరలించడానికి డ్రైవర్ తో కలిసి రెండవ క్వారీలో ఇసుక నింపుకోవడానికి సోమవారం రాత్రి వచ్చారు. మంగళవారం ఉదయం అబ్దుల్ హద్ మృతి చెంది రోడ్డు పక్కన కనిపించాడు. అతని కడుపు పై బలమైన గాయం, పలు చోట్ల గాయాలు కూడా ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఆ మృతదేహాన్ని తీసుకు వచ్చి రోడ్డుపై పడేసి ఉంటారని పలువురు అనుకుంటున్నారు. ఇసుకను లారీని రాత్రిపూట జేసీబీ ద్వారా నింపుతుండగా..లారీ పైన ఉన్న అబ్దుల్ హద్ కు జేసీబీ బకెట్ తగిలి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇది బయట పడకుండా ఇసుక క్వారీల నిర్వాహకులు మృతదేహాన్ని తీసుకు వచ్చి కథ గావ్ రోడ్డు పక్కన పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా అబ్దుల్ హద్ మృతి చెందడంతో ఇసుక క్వారీల నిర్వాహకులు తవ్వకాలు నిలిపివేసారు. దీంతో హత్య చేసి నట్లుగా అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి.

దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన అబ్దుల్ హద్ డ్రైవర్ విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చే సమాచారం ఉన్నప్పటికీ.. పోలీసులు ఆయనను ముందుగానే అదుపులోకి తీసుకుని, విచారణ చేయకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఇసుక క్వారీ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూడవలసిన పోలీసులు వాటిని చూడకుండానే మృతదేహం తరలించారు. ఈ విషయంపై పోలీసులు సమాచారం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. పూర్తిగా విచారించిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక కార్యనిర్వాహకులు మృతుని కుటుంబానికి రూ.5లక్షల ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story