తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: బండి సంజయ్

by Javid Pasha |
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, జిల్లాల వారీగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇదే ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంటా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​మంగళవారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని, జీతాల చెల్లింపులను ప్రతి నెలా రెండో వారం దాకా సాగదీస్తున్నారన్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్​మెంట్, సరెండర్ బిల్లులు 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్‌లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యులకు చికిత్స కోసం కూడా చెల్లించకపోవడం అత్యంత దురదృష్టకరమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను రెండేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని బీఎస్​కే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు 2020 జులై తరువాత సమర్పించిన వేలాది పెండింగ్ బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

మార్చి 31 లోపు పెండింగ్ బిల్లులు పాస్ కాకపోతే పరిస్థితి ఏంటని మండిపడ్డారు. హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా యాతనలు పడుతున్నా సర్కార్​స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్నీ అదే రోజు అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలేమయ్యాయని చురకలంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీఎస్​కే డిమాండ్​ చేశారు.

బీజేపీలోకి ములుగు జిల్లా నేతలు

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​సమక్షంలో ములుగు జిల్లా నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు సహా వెంకటాపురం ఎంపీపీ, పలువురు నేతలు కమలం కండువా కప్పుకున్నారు.

పార్టీలో చేరిన వారిలో వెంకటాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు చెరుకూరు సతీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీటీసీ రామెళ్ల లక్ష్మీ శేఖర్, ఆదివాసీ నవనిర్మాణ సేన మండలాధ్యక్షుడు పోలెబోయిన భార్గవ్, వార్డు మెంబర్లు చెరుకూరి కుమారి, చెరుకుల మహాలక్ష్మి, చెరుకుల నాగరాజు, కంపెళ్ల సురేష్, జాజి ప్రశాంత్, పొనగంటి నరేష్, బట్టా శ్రీధర్, మంచెన గంగాధర సహా పలువురు నేతలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed