యుద్ధ భయాలతో వరుసగా ఐదో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

by Web Desk |
యుద్ధ భయాలతో వరుసగా ఐదో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో యుద్ధ భయాల కారణంగా వరుసగా ఐదో రోజు నష్టాలు నమోదయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం నుంచే నష్టాలతో కొనసాగింది. ఓ దశలో 1,200 పాయింట్లకు పైగా పతమైన సెన్సెక్స్ ఆ తర్వాత మిడ్-సెషన్ సమయం నుంచి నష్టాల నుంచి కోలుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడమే దీనికి కారణమని విశ్లేషకులు తెలిపారు. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశలుగా రష్యా గుర్తించడం, దీన్ని ఉక్రెయిన్‌తో పాటు అమెరికా, నాటో కూటమి దేశాలు వ్యతిరేకించడం, రష్యాపై ఆంక్షలకు సిద్ధమని యూరప్ సమాఖ్య హెచ్చరించడం సహా పలు కారణాలతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో భారీగా నష్టాలు నమోదయ్యాయి. దీనికితోడు ముడి చమురు ధరలు 96 డాలర్లు దాటడం లాంటి పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే, ప్రస్తుతానికి రష్యా తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల్ని పంపడంలేదని ప్రకటించడంతో సెషన్ చివర్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 382.91 పాయింట్లు కోల్పోయి 57,300 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు నష్టపోయి 17,092 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ రంగాలు ఎక్కువ పతనమై నష్టాలను పెంచాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. టాటా స్టీల్, టీసీఎస్, ఎస్‌బీఐ, డా రెడ్డీస్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.71 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed