బీజేపీలో BRS పార్టీ విలీనం ఖాయం: ఎమ్మెల్యే బీర్ల సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
బీజేపీలో BRS పార్టీ విలీనం ఖాయం: ఎమ్మెల్యే బీర్ల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గల్లీలో మొహం చెల్లక, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. కేటీఆర్, హరీష్​రావు, సురేష్ రెడ్డిలది విచిత్ర పరిస్థితని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో తిరగలేకనే, ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీతో దోస్తి కట్టేందుకే ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని వెల్లడించారు. కమలం పార్టీలోకి కారును విలీనం చేసేందుకు రెడీ అయ్యారని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా, బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అహంపూరితంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక గత ప్రభుత్వ హయంలో దందాలు, కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు జాయినింగ్స్ జరిగాయని, ఇప్పుడు ప్రజాపాలన చూసి చేరికలు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మధ్య తేడా ఇదేనని స్పష్టం చేశారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్కు మనుగడ లేదన్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గులేదన్నారు. కనీసం ఒక్క ఎంపీ సీటైనా గెలిచారా..? అంటూ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ‘మీరు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకొకటా?’ అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన, సంక్షేమ పథకాలు చూసి భాగస్వామ్యులు అయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed