అడ్డొస్తే వదిలేదిలే.. ఈ రేంజ్‌లో ఇసుక మాఫియా..

by Vinod kumar |
అడ్డొస్తే వదిలేదిలే.. ఈ రేంజ్‌లో ఇసుక మాఫియా..
X

దిశ, అయిజ: మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డొస్తే ఎవరినైనా వదిలేది లేదనే రేంజ్‌లో దాడులకు దిగుతున్నారు. ఇసుక దందా ఎలా ఉందంటే.. తమ ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా కనిపెట్టినట్టు అనుమానం వస్తే.. వారిపై దాడులు చేసే పనిలో పడ్డారు. మూడు రోజుల క్రితం అక్రమ ఇసుక దందాపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిపై ఇసుక మాఫియా దాడికి తెగబడ్డారు. అయిజ మండలం వేనుసోంపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న తుంగభద్ర నది నుంచి శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కొందరు ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వేనుసోంపురం గ్రామానికి చెందిన సునీల్‌ను చూసిన ట్రాక్టర్ల యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వడానికి వచ్చాడని అతనిపై దాడి చేశారు.

ఈ దాడిలో సునీల్ తలకు బలమైన గాయమైంది. గాయపడ్డా వ్యక్తిని కుటుంబ సభ్యులు గద్వాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇసుక మాఫియాకు అడ్డొస్తున్నాడనే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంత జరిగినా కూడా ఇసుక మాఫియా ఆగడం లేదంటే.. దీని వెనుక ఉన్న బలమైన శక్తుల హస్తం లేకపోలేదంటూ అయిజ మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, పోలీసు అధికారులు అక్రమ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed