- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువులను చెర బడుతున్న ప్రజాప్రతినిధులు.. 17 ఎకరాలకు మిగిలింది 3 ఎకరాలే
దిశ, శేరిలింగంపల్లి: చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కాయి. దర్జాగా హద్దులు వేస్తూ ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అంతేకాదు జబర్దస్తుగా నిర్మాణాలకు పూనుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆక్రమణదారులతో మనకెందుకులే..? అనేలా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కబ్జాదారులకు నాయకుల అండదండలే కాదు.. అందులో ఉన్నది సైతం ప్రజాప్రతినిధులేనని తెలిసి సైడ్ అయిపోతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒకప్పుడు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, ఇనాం జాగలు, చెరువు కుంటలు ఉండేవి. కానీ ఇప్పుడవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి.
ప్రస్తుతం ఉన్న చెరువుల్లోనూ కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆక్రమణదారుల్లో ఎక్కువగా నాయకుల వారి అనుచరుల కబంధ హస్తాల్లో ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా మియాపూర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్‌ల పరిధిలో వందల కోట్ల విలువైన భూములను చెరబట్టారు. ఇందులో శిఖం భూముల నుంచి మొదలు ప్రభుత్వ స్థలాల వరకు ఖాళీగా కనిపిస్తే హద్దు రాళ్లు వేసేశారు. కబ్జా చేసిన వారికి రెవెన్యూ అధికారుల అండ, జీహెచ్ఎంసీ అధికారుల మద్దతు లభిస్తుండడంతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కబ్జాలో చెరువు శిఖం..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక్క డివిజన్ లో ప్రస్తుతం రెండు మూడు చెరువులకు మించి కాన రావడం లేదు. నాయకుల కన్ను పడి కనుమరుగయ్యాయి. ఓవైపు మహా నగరం లోని చెరువులు, కుంటలను పరిరక్షించడంతో పాటు వాటిని సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెబుతుంటే ఆయన దత్తత డివిజన్‌లోనే ఆక్రమణలకు గురవుతున్నాయి. హైదర్ నగర్ డివిజన్ 119 సర్వే నెంబర్ లో ఉన్న కింది కుంట చెరువు విస్తీర్ణం 8 ఎకరాల 17 గుంటలు కాగా.. గత కొన్నేళ్లుగా చెరువు కబ్జా కోరల్లో చిక్కి శల్యమైంది. ప్రస్తుతం ఈ చెరువు శిఖం లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు కింది కుంట చెరువు విస్తీర్ణం 3 ఎకరాలకు కుంచించుకుపోయింది. గతంలో చెరువు ఎఫ్‌టీఎలోనే రోడ్డును వేసిన అధికారులు ఆ పక్కనే హద్దులు ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో రోడ్డుకు చెరువుకు మధ్యలో ఉన్న స్థలాన్ని కొందరు పెద్దలు దక్కించుకున్నారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వారు ఈ మధ్య అందులో కట్టడాలు మొదలు పెట్టారు.
ప్రజా ప్రతినిధుల సాక్షిగా కట్టడాలు
కందికుంట కబ్జాల్లో ఓ కార్పొరేటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ స్థలం విషయంలో గతంలో ఇద్దరు నాయకుల మధ్య అంతర్గత తగాదాలు కూడా చోటు చేసుకోగా కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. అనంతరం చేతులు మారిన ఈ స్థలం సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్‌ఎస్ లీడర్, ఓ సంఘానికి రాష్ట్ర నాయకుడిగా కూడా వ్యవహరించిన ఆయన చేతుల్లోకి వెళ్లింది. వారు టౌన్ ప్లానింగ్ అధికారులకు భవన నిర్మాణ అనుమతులకు అప్లై చేయగా ఆ స్థలానికి సంబంధించి ఏమాత్రం పరిశీలన చేయకుండానే అనుమతులు జారీ చేశారు. ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు సదరు నాయకుడు. చెరువు అంచున ఉన్న ఈ నిర్మాణానికి కూకట్ పల్లి సర్కిల్ అధికారులు జీ ప్లస్ 5 అనుమతులు జారీ చేసినట్లు చెబుతున్నారు. కానీ ఆ స్థలం ఎక్కడుంది, దాని పూర్వాపరాలు ఏంటి..? అనేది కనీస పరిశీలన చేయకపోవడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోర్టులో ఉన్న నిర్మాణాలు..
కింది కుంట చెరువు శిఖం లో నిర్మాణాలు సాగిస్తున్నారంటూ గతంలో బీజేపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అలాగే పలుమార్లు స్థల పరిశీలన చేసి నిర్మాణాలను అడ్డుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఓ కార్పొరేటర్ సహకారంతో వేగంగా పనులు చేపట్టి ఐదు అంతస్థులు కట్టేశారు. కోర్టులో ఉన్న స్థలం విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోకుండా ఎలా పర్మిషన్‌లు ఇచ్చారు. నిర్మాణదారులు ఎలా కట్టారు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణ అనుమతుల పై టీపీఎస్ సిబ్బందిని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించిన అధికారి అందుబాటులోకి రాలేదు.