వంటనూనె ధరలను తగ్గించిన బ్రాండెడ్ కంపెనీలు!

by Manoj |
వంటనూనె ధరలను తగ్గించిన బ్రాండెడ్ కంపెనీలు!
X

న్యూఢిల్లీ: అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణ భారాన్ని మోస్తున్న సామాన్యులకు వంటనూనె తయారీ కంపెనీలు కొంత ఊరట కల్పించాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో దేశీయ బ్రాండెడ్ వంటనూనె తయారీదారులు పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనె ధరలను లీటర్‌కు రూ. 15 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గుదల ప్రభావం ఆర్థికవ్యవస్థతో పాటు దేశంలోని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలపై తక్షణం ప్రభావం చూపుతుంది. అయితే, ప్రీమియం బ్రాండ్ కంపెనీలు ధరల తగ్గింపును వినియోగదారులకు అందించడానికి కొంత సమయం పడుతుందని భారతీయ వంటనూనె తయారీ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రావు దేశాయ్ అన్నారు.

ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో డిమాండ్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనుంది. తాజా వివరాల ప్రకారం, పామాయిల్ ధరలు లీటర్‌కు రూ. 7-8 తగ్గగా, పొద్దుతిరుగుడు నూనె లీటర్‌కు రూ. 10-15, సోయాబీన్ నూనె లీటర్‌కు రూ. 5 తగ్గాయని సుధాకర్ దేశాయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని వినియోగదారులపై ఎక్కువ ప్రభావం పడకుండా తాము వంటనూనె గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్‌పీ)ని కూడా తగ్గిస్తున్నాం. ఇది మార్కెట్ ధోరణికి అనుగుణంగా తగ్గుతుంది. కొత్త ఎంఆర్‌పీతో కూడిన వంటనూనెలు వచ్చే వారం నాటికి మార్కెట్లోకి వస్తాయని అదానీ విల్మార్ ఎండీ అంగ్‌షు మల్లిక్ వివరించారు. హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ గత వారం ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై లీటర్‌కు రూ. 15 తగ్గించింది. ఈ వారంలో మరో రూ. 20 తగ్గించడంతో వంటనూనె ధర రూ. 200కి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed