- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలపై లైంగిక దాడులకు నిరసనగా సైకిల్‌పై రాష్ట్రపతి భవన్‌కు..
దిశ, కామారెడ్డి రూరల్: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువవుతున్నందున ఓ వ్యక్తి ఘటనలకు నిరసన వ్యక్తం చేస్తూ.. సైకిల్ యాత్ర చేపట్టాడు. అత్యాచారాలను తగ్గించడానికి పరిష్కారం చూపాలని కొన్ని డిమాండ్లతో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి సరికొండ ఋషికేశ్వర్ రాజు మిర్యాలగూడ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సైకిల్ పై వెళ్తున్నాడు. ఆయన చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం కామారెడ్డి కి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయనను 'దిశ' పలకరించగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. దిశ, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, దేశంలో ప్రతిరోజు ప్రతి గంట, ప్రతి నిమిషం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక వెల్లడించిందన్నారు. 2012లో నిర్భయ ఘటన అనంతరం అత్యాచార కారకులకు అత్యధికంగా మరణ శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేశారని, ఈ శిక్షతో నేరస్తులు భయపడి అత్యాచారాల ఘటనలు తగ్గుతాయని భావించినా.. అది జరగడం లేదన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక రెండు ఘటనల్లో నిందితులకు మరణ శిక్ష విధించారని తెలిపారు. ఎన్.సి.ఆర్.బి గణాంకాల ప్రకారం శిక్షలు అమలైన తర్వాత ఘటనలను పరిశీలిస్తే 2015లో 34,651, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయని, అంతకుముందు 2012 సంవత్సరంలో ఈ సంఖ్య 24,923 మాత్రమేనని తెలిపారు.
నిర్భయ చట్టం కామాంధుల్లో మార్పు తేలేదని, 9 నెలల పసిపాప, 80 ఏళ్ల వృద్ధులు, తల్లి, చెల్లికి తేడా లేకుండా నిండు ప్రాణాలు బలితీసుకునే రాక్షసత్వం ఎందుకు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించడానికి అనేక చట్టాలు ఉన్నాయని, కానీ అవి బూజు పట్టి పోయాయని, చట్టాల్లో ఉన్న లొసుగులు, ఇతరత్రా కారణాలతో దోషులు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. లోపం చదువుల్లో ఉందా, చట్టాల్లో ఉందా అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 'నిర్భయ నిధికి బడ్జెట్ లో మరిన్ని నిధులు పెంచాలని, లైంగిక వేధింపులు, అత్యాచార సంబంధిత కేసులకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఫోక్సో కోర్టులను జిల్లాల వారీగా ఏర్పాటుచేసి వీలైనంత త్వరగా నిందితులకు శిక్ష పడేలా తీర్పు వచ్చేలా చూడాలన్నారు. ఈ కోర్టుల్లో జడ్జీల నియామకాలను పెంచాలన్నారు. పోర్న్ వెబ్ సైట్ లను పూర్తిగా నిషేధించాలని, అశ్లీల చిత్రాలను దేశంలో పూర్తిగా నిషేదించాలన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందని, వాటి సంఖ్యను పెంచాలని కోరారు. వీటిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడానికి టాని సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని చెప్పారు.