ఆసుపత్రిలో గర్భిణీల అవస్థలు.. ఉదయం 4కి వస్తే కానీ జరగని పని..?

by Satheesh |   ( Updated:2022-04-07 01:00:50.0  )
ఆసుపత్రిలో గర్భిణీల అవస్థలు.. ఉదయం 4కి వస్తే కానీ జరగని పని..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక గర్భిణులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సర్కారీ ఆసుపత్రులన్నింటిని కార్పొరేట్​ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావులు ఇస్తున్న హామీలు అమలు కావడం లేదు. దీంతో వైద్యం కొరకు గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు వచ్చి క్యూ లైన్లలో నిలబడితే కానీ చికిత్స ప్రక్రియ వేగంగా జరగడం లేదు. దీంతో హైదరాబాద్‌తో పాటు జిల్లాల నుంచి కూడా వందల మంది గర్భిణులు తెల్లవారు జామునే ప్రసూతి ఆసుపత్రికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడ లేక చెప్పులు పెట్టి మరీ వేచిచూడటం గమనార్హం. పేషెంట్ల రద్దీతో కొందరు సొమ్మసిల్లుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రెగ్నెంట్‌లను తీసుకువచ్చిన సహాయకులు కూర్చునేందుకు సౌకర్యాలు లేక రోడ్ల పక్కన వెయిట్​ చేయాల్సిన పరిస్థితులు దాపరించింది. డ్రికింగ్ వాటర్​కూడా అందుబాటులో లేవని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేషెంట్​సహయకులు మండిపడుతున్నారు. పైగా ప్రశ్నించోళ్లకు ఆలస్యంగా చికిత్సను ప్రారంభిస్తున్నట్లు మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన ఓ పేషెంట్​బంధువు ఆరోపించారు.

వైద్యమే నరకం..

మెటర్నిటీ ఆసుపత్రిలో 170 బెడ్లు ఉన్నాయి. కానీ ప్రతీ రోజు దాదాపు వెయ్యి మంది ఓపికి వస్తున్నట్లు మెడికల్​స్టాఫ్​పేర్కొంటున్నారు. వీరిలో 35 మంది ఇన్​పేషెంట్లుగా చేరుతుంటారు. రెండు నుంచి 300 మంది ఏఎన్‌సీ చెకప్‌లకు వస్తుండగా, మిగతా మహిళలు జనరల్​పరీక్షలకు వస్తున్నారు. అయితే సరిపడా స్టాఫ్, మౌలిక సదుపాయాలు లేనందున వైద్య సేవల్లో ఆలస్యం జరుగుతుంది. నెలవారీ పరీక్షలు, డెలివరీలు, ఓపీ పొందేందుకు గర్భిణులు నరకం అనుభవిస్తున్నారు. ఏఎన్‌సీ(యాంటీనాటల్​చెకప్స్), ఓపీ రిజిస్ట్రేషన్, డాక్టర్లను కలిసేందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. ఓపీ కౌంటర్ ప్రదేశాలు, వార్డులు అపరిశుభ్రతతో తాండవిస్తున్నాయి. ఆ ప్రదేశాల్లోనే గర్భిణీల బరువు, బీపీ, హిమోగ్లోబిన్, రక్త పరీక్షలు వంటి రెగ్యులర్​చెకప్‌ల కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తున్నది. ఇక ట్రీట్మెంట్, ఆరోగ్య సమస్యలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు గర్భిణీలు నరకయాతన పడుతున్నారు. బాధితులు అడిగే వివరాలు చెప్పేందుకు కూడా స్టాఫ్ కు ఓపిక ఉండదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిటీకి పరుగులు..

జిల్లా, స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నమ్మకాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భిణులు హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రతీ నెల నిర్వహించే ఏఎన్​సీ(యాంటీనాటల్​ చెకప్) లకు సిటీకి వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొందరు మొదట్నుంచి చివరి నెలల వరకు ఇదే ఆసుపత్రికి వస్తుండగా, మరి కొందరు మూడు నాలుగునెలల తర్వాత వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జిల్లా, స్థానిక పీహెచ్‌సీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక సమస్యలు వస్తున్నాయి. దీంతో కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల రద్దీ పెరిగిపోయింది. తద్వారా ఆశించినంత వేగంగా వైద్యం అందించలేకపోతున్నామని మెటర్నిటీకి చెందిన కొందరు డాక్టర్లు ఆఫ్‌ ది రికార్డులో చెప్పారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా, పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed