క‌ళ్యాణ‌ల‌క్ష్మి స్కీంలో స్కాం.. అయినా అక్రమార్కుల‌కే అంద‌ల‌మా..?

by Satheesh |   ( Updated:2022-03-22 13:24:39.0  )
క‌ళ్యాణ‌ల‌క్ష్మి స్కీంలో స్కాం.. అయినా అక్రమార్కుల‌కే అంద‌ల‌మా..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ స్కీం స్కాంను ప్రభుత్వం లైట్ తీసుకుందా..? స్కాంపై స్వయంగా సీఎస్ సోమేష్‌కుమార్ సీరియ‌స్‌గా స్పందించినా.. ఆ త‌ర్వాత తేలిపోయిందా..? అక్రమాల‌కు పాల్పడ్డార‌ని రెవెన్యూ అధికారుల‌పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక అంద‌జేసినా.. కేవ‌లం షోకాజ్ నోటీసుల‌కే ప‌రిమిత‌మై.. త‌దుప‌రి విచార‌ణ అట‌కెక్కిందా..? అంటే ఖ‌చ్చితంగా అవున‌నే స‌మాధానాలే రెవెన్యూ శాఖ అధికార వ‌ర్గాల నుంచి వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. పేద కుటుంబాల్లో పెళ్లి సంబురం క‌నిపించాల‌నే స‌దుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమ‌లు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కంలో త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లోని అధికారులు, సిబ్బందిచేతి వాటం ప్రద‌ర్శించారు. ల‌బ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల క్రితం దీనిపై సీఎస్ సోమేష్ కుమార్ స్వయంగా స్పందించారు. దీనిపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఆ ప్రకార‌మే విచార‌ణ చేసిన అధికారుల‌కు మైండ్ బ్లాక‌య్యే విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది త‌హ‌సీల్దార్లు, ఇత‌ర ఉద్యోగులు ఉంటే ఉమ్మడి వ‌రంగ‌ల్‌కు చెందిన వారే 16మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, ధర్మసాగర్, శాయంపేట, దుగ్గొండి, నర్సంపేట, కేసముద్రం, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు తదితర తహసీల్దారు కార్యాలయాలపై ఎక్కువ‌గా ఫిర్యాదులు వెళ్లాయి.

షోకాజ్‌తో స‌రి..

షాదీ ముబార‌క్‌, క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కాల డ‌బ్బుల‌ను లబ్ధిదారుల‌కు అంద‌జేసే విష‌యంలో ఆయా రెవెన్యూ కార్యాల‌యాల్లో త‌హ‌సీల్దార్లు మొద‌లు డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్ఏలు , ఇన్‌స్పెక్టర్లు, ఇత‌ర సిబ్బంది పెద్ద ఎత్తున చేతివాటం ప్రద‌ర్శించిన వారిలో ఉండ‌టం విశేషం. అవినీతి, అక్రమాల‌కు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు అంద‌జేసిన నివేదిక ఆధారంగా చ‌ర్యల‌ను ఆరంభించిన ప్రభుత్వం మొద‌టి ద‌శ‌లో స‌ద‌రు అధికారులను కీల‌క పోస్టుల నుంచి త‌ప్పించింది. త‌దుప‌రి విచార‌ణ అనంత‌రం స‌ద‌రు అధికారుల‌పై వేటు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే మాత్రం అదంతా జ‌రిగే ప‌ని కాద‌ని అర్థమ‌వుతోంది. పై పెచ్చుగా కీల‌క పోస్టుల నుంచి త‌ప్పించిన అధికారుల‌కే మ‌ళ్లీ ఉన్నత ప‌దవుల్లో కూర్చోబెడుతుండ‌టమే వారి రాచ మ‌ర్యాద‌కు నిద‌ర్శన‌మ‌ని చెప్పాలి.

ధ‌ర్మసాగ‌ర్ రాజుపై వేటేసిన‌ట్లే వేసి.. మ‌ళ్లీ కీల‌క ప‌ద‌వి..

క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌ల చెక్కుల పంపిణీలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ తహసీల్దార్ రాజుతో పాటు కార్యాల‌యానికి చెందిన మ‌రో ఇద్దరు సిబ్బందిని అక్కడి విధుల నుంచి త‌ప్పించారు. రాజును పరకాల ఆర్డీఓ కార్యాలయ డీఏవోగా, ప‌ర‌కాల‌లో డీఏవోగా ప‌నిచేస్తున్న ర‌జ‌నిని ధ‌ర్మసాగ‌ర్ త‌హ‌సీల్దార్‌గా బ‌దిలీ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. డీఏవోగా అయితే రాజుపై వేటువేసిన అధికారులు ఓ వైపు విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే.. మ‌ళ్లీ శాయంపేట త‌హ‌సీల్దార్‌గా నియ‌మించ‌డం రెవెన్యూ వ‌ర్గాల‌ను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఇక శాయంపేట త‌హ‌సీల్దార్ కార్యాల‌య అధికారుల‌పైనా క‌ళ్యాణ ల‌క్ష్మి స్కీం స్కాం ఆరోప‌ణ‌లున్న నేప‌థ్యంలో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇక్కడ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేస్తున్న పోరిక హ‌రిక కృష్ణను సైతం బ‌దిలీ చేయ‌డం గ‌మ‌నార్హం.

విచార‌ణ ముగిసిన‌ట్లే..?

ల‌బ్ధిదారుల నుంచి డ‌బ్బు వ‌సూళ్లకు పాల్పడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారుల‌కు, సిబ్బందికి ప్రమోష‌న్లు.. మ‌నోభీష్ఠానికి అనుగుణంగా పోస్టింగులు ద‌క్కుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల చెక్కుల పంపిణీలో అక్రమాల‌కు పాల్పడిన‌ట్లుగా ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న అధికారుల‌పై విచార‌ణ ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. వీరిపై పెద్దగా చ‌ర్యల్లేకుండానే ప్రభుత్వం విచార‌ణ‌ను ప‌క్కన పెట్టేసిన‌ట్లుగా స్పష్టమ‌వుతోంది.

Advertisement

Next Story

Most Viewed