పల్లెల్లో గుడుంబా చిచ్చు.. గ్రామాల్లో కట్టలు తెగిన గుడుంబా ప్రవాహం

by Javid Pasha |
పల్లెల్లో గుడుంబా చిచ్చు.. గ్రామాల్లో కట్టలు తెగిన గుడుంబా ప్రవాహం
X

దిశ, ఖానాపూర్: మండలంలో చాలా తండాలు, కొన్ని గ్రామాలు గుడుంబా తయారీ కేంద్రాలుగా మారాయి. మధ్యవయసు వారితో పాటు యువకులు సైతం మత్తుకు బానిసలై కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. చిన్న వయస్సులోనే తాగుడుకి బానిసలై యువత పెడమార్గం పట్టింది. గుడుంబా పై ఉక్కుపాదం మోపాల్సిన అధికారుల అలసత్వం గుడుంబా తయారీదారులకు వరంలా మారింది. ఇదే అదునుగా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కొన్ని తండాల్లో అయితే గుడుంబా తయారీ కుటీర పరిశ్రమగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని కుటుంబాలైతే ఇదే ప్రధాన ఆదాయ వనరుగా చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే గుడుంబాకి బానిసైన చాలామంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇంట్లో కనిపించిన వస్తువుని కళ్ళ ముందే మాయం చేసి అమ్మి మరో సారా కొట్లో దర్శనమిస్తున్నారు.


ప్రభుత్వం గుడుంబా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలిచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు మామూళ్ల మత్తులో తూగుతుండడంతో ప్రభుత్వ చర్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అప్పట్లో అధికారులు చర్యలు పటిష్టంగా చేపట్టినప్పుడు గుడుంబా తయారీకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

ఆ తర్వాత కాలంలో నిర్లక్ష్యం వహించడంతో తిరిగి గుడుంబా తయారీ, రవాణా ఊపందుకున్నాయి. గతంలో పనిచేసిన అధికారులు గుడుంబాని అరికట్టడంలో విజయవంతమయ్యారు. అదే ఒరవడిని నూతనంగా వచ్చిన అధికారులు కొనసాగించకపోవడంతో మళ్ళీ గుడుంబా తయారీ, రవాణా పెరిగిందనే అభిప్రాయం వెలువడుతుంది.

సినిమాటిక్ స్థాయిలో రవాణా

గుడుంబాని తండాల్లో, పల్లెల్లో తయారు చేస్తూ పట్టణాలకు రవాణా చేస్తున్నారు. కాగా రవాణా చేసే క్రమంలో పోలీసులకు, ఎక్సైజ్ శాఖకు దొరకకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మండలంలో ప్రధానంగా నాజీ తండ, చిలుకమ్మ తండ, కీర్య తండ, పర్ష్య తండ, బోటి మీది తండ, బండ మామిడి తండాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేసి బయట ప్రాంతాలకి రవాణా చేస్తున్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గుడుంబా విక్రయదారులకు, పదుల సంఖ్యల్లో ఉన్న గుడుంబా అడ్డాలకి ట్యూబ్‌లలో, వాటర్ కాన్ రూపంలో చేరవేస్తున్నారు.

గ్రామ స్థాయిలో తయారైన గుడుంబాని కొంతమంది యువకులు కాలేజ్ బాగులలో సర్దుకొని బైక్‌లపై వరంగల్ నగరానికి చేరుకుంటారు. వీరు చూడడానికి స్టూడెంట్స్ అనుకునేలా ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటారు. వరంగల్ నుండి ట్రైన్, బస్సుల ద్వారా హైదరాబాద్ లాంటి మహానగరానికి గ్రామాల నుండి గుడుంబా రవాణా కొనసాగుతుందంటే గుడుంబా డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మత్తులో మగ్గుతున్న యువతరం

గుడుంబా తయారీ, రవాణా వలన సులభంగా డబ్బులు సంపాదిస్తుండడంతో పాటు చెడు సహవాసాలు పెరగడంతో యువత అదుపు తప్పుతున్నారు. చిన్న వయస్సులోనే తాగుడికి బానిసలై కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. కొందరైతే, అకాల మరణంతో భార్య-పిల్లల్ని అనాధల్ని చేసేవారు మరికొందరు. ఇటీవలి కాలంలో మత్తుతో పాటు నేర ప్రవృత్తి పెరిగింది. శాంతి భద్రతల సమస్యలు కూడా పెరిగాయి. చిల్లర దొంగతనాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. ఎక్కువ రేటు మద్యం కొనలేని పేదవారే, కూలినాలి చేస్తూ బ్రతుకు పోరాటం చేసే వారే బాధితులుగా మారుతున్నారు.

యథేచ్చగా బెల్లం రవాణా

గుడుంబా తయారీకి ప్రధానమైన ముడి వనరు బెల్లం, పటిక కాగా వీటి రవాణాని అధికారులు అదుపు చేయలేకపోతున్నారు. ఖచ్చితమైన సమాచారం వచ్చిన ఒకటి రెండు సంఘటనల్లో పట్టుకున్నది మినహాయిస్తే బెల్లం అక్రమ రవాణా నియంత్రించడంలో ఆ శాఖ విఫలమైనదనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గుడుంబా తయారీదారులు కూడా నూతన పంథాని అలవర్చుకున్నారు.

గుడుంబా తయారీ ఇళ్ళల్లో కాకుండా అటవీ ప్రాంతాల్లో, గ్రామాలకి దూర ప్రాంతాల్లో చేస్తూ కావలసిన ముడి పదార్థాలు నేరుగా అక్కడికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అక్రమ బెల్లం రవాణాదారులతో పాటు వ్యాపారుల పై నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు నీడలో విఫలమైందని తెలుస్తుంది.

అనుమానిత తండాల్లో నిఘా ద్వారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. కాని దాడులకి ముందే సమాచారం బహిర్గతమై తయారీ దారులకి చేరడం, దీంతో అధికారులు వచ్చేలోపే అంతా సవ్యంగా ఉండడం పరిపాటిగా మారింది. దాడులకి సంబంధించి ముందస్తుగా సమాచారం గుడుంబా తయారీదారులకు చేరడం పలు అనుమానాలకు తావిస్తుంది. పల్లెల్లో బిగుసుకుపోయిన గుడుంబా వ్యవస్థను కూకటి వేర్లతో సహా తీసెయ్యడం కోసం కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రేపటి తరాన్ని మృత్యువు నీడ నుండి కాపాడాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed