పోలీస్ ల్యాండ్ కబ్జా.. తెలిసినా నోరు మెదపని సీఎస్!

by GSrikanth |
పోలీస్ ల్యాండ్ కబ్జా.. తెలిసినా నోరు మెదపని సీఎస్!
X

అమీన్ పూర్.. సంగారెడ్డి జిల్లాలో ఉన్నా.. సిటీ శివారు ప్రాంతం.. ఇక్కడ జాగా అంటే కోట్ల మాటే..! ఖాళీ స్థలం ఉంది కదా.. అని కన్నేశాయి రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు..! అందులో మొదట రోడ్డు వేశాయి. ఇంకేముంది వెంచర్ ఏర్పాటు చేశాయి. మెయిన్ సెంటర్ కావడంతో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సీన్ కట్ చేస్తే అది పోలీసుల జాగా.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం 2006వ సంవత్సరంలో 343/1 సర్వే నంబర్‌లో ప్రభుత్వం 70 ఎకరాల జాగాను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సర్వేచేసి ఎస్పీఎఫ్ అకాడమీకి అప్పగించింది. అందులో 11 ఎకరాలు మాయమైంది. ఇప్పుడు దాని విలువ 250 కోట్లు! ఇదంతా సీఎస్ మొదలు తాసిల్దార్ వరకు తెలిసినా నోరెత్తడం లేదు. తెరవెనుక ఎవరున్నట్టు..! ఎందుకు మిన్నకుంటున్నట్టు..!

దిశ, తెలంగాణ బ్యూరో: అది ఎక్కడి స్థలమైనా ఫర్వాలేదు. ఎవరి జాగా అయినా సరే.. ఆఖరికి పోలీసు సంస్థలకు కేటాయించిన భూమైనా ఓకే.. అంగబలం, అర్థబలం.. అన్నింటికీ మించిన రాజకీయ బలం ఉంటే చాలు. పక్క సర్వే నంబర్లు వేయాలి.. ప్రభుత్వ భూములను కాజేయాలి. ఇప్పుడిదే రాజకీయ రియల్టర్ల ట్రెండ్. రాజకీయ నాయకులే ఎండీలుగా, చైర్మన్లుగా నెలకొల్పిన సంస్థల ఆగడాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత వారికి వరంగా మారుతున్నది. ఆఖరికి పోలీసు సంస్థలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడం విడ్డూరం. వివిధ సంస్థలకు కేటాయించిన స్థలం అన్యాక్రాంతమవుతున్నదంటూ ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం నిజానిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే చేయడం లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమి కోసం 2006లో స్థలాన్ని కేటాయించింది. 250 కోట్ల విలువ చేసే ఈ భూమి కబ్జాకోరుల కంట్లో పడింది. దాన్ని కబ్జా చేశారు. దీనిపై గత నెల 17న హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సీఎస్, సంగారెడ్డి కలెక్టర్ మొదలుకొని ఆర్డీవో, తాసిల్దార్, జిల్లా రిజిస్ట్రార్ తో పాటు డీజీపీ, ఎస్పీఎఫ్​ డైరెక్టర్ జనరల్ , విజిలెన్స్ డైరెక్టర్ లకు మెయిల్, వాట్సాప్ ద్వారా కంప్లయింట్ పంపింది.

వారి భూమికే దిక్కులేదు

– సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో సర్వే నం.343/1 లోని 70 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. 2006 డిసెంబరు ఏడో తేదీన పటాన్ చెరు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ , సంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే, మండల సర్వేయర్, అమీన్ పూర్ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సేవకులతో పాటు బంటు శ్రీనివాస్, బింగి నర్సింలు, మన్నె అంజయ్యలనే ముగ్గురు పంచుల సమక్షంలో సర్వే చేశారు. లొకేషన్ స్కెచ్ మ్యాపు కూడా వేశారు. ఏ బీ సీ డీ జీ హెచ్ లుగా మార్కు చేసి మ్యాపు వేశారు.

– అమీన్ పూర్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమికి సర్వే నం.343/1లో 70 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ధరణిలో 343/2/1 గా చూపిస్తున్నది. డైరెక్టర్ జనరల్ పేరిట నిక్షిప్తమైంది.

– 2006 డిసెంబరు ఏడో తేదీన పంచమానా చేసి అప్పగించారు. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్, ధరణి క్యాడస్ట్రల్ మ్యాప్ లతో పోల్చి చూస్తే 11 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు స్పష్టంగా తెలుస్తున్నది.

– 70 ఎకరాల్లో 11 ఎకరాలకు పైగానే అన్యాక్రాంతమైందన్న ఆరోపణలున్నాయి. దాంట్లోనే కేబీసీ లే అవుట్, త్రిపుర లే అవుట్ వంటివి గ్రామ పంచాయతీలతో కబ్జా చేశారు. ఈ స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.250 కోట్ల పైమాటే. ఇక్కడ ఇండ్లు కట్టి రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు అమ్మేశారు.

వారి నుంచి ఫుల్​సపోర్ట్

అమీన్ పూర్‌లో ఎస్పీఎఫ్ స్థలాన్ని పక్కనున్న సర్వే నంబర్లతో మాయం చేశారు. అందమైన బ్రోచర్లు ముద్రించారు. విల్లాలు నిర్మించి అమ్మేశారు. లే అవుట్లు వేసి ప్లాట్లనూ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ చైర్మన్ , కమిషనర్, తాసిల్దార్, గిర్దావర్ లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇరిగేషన్, మున్సిపల్, హెచ్​ఎండీఏ అధికారులంతా ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మిస్తుంటే కండ్లు మూసుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అక్రమ వెంచర్లను నియంత్రించకుండా విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అక్రమార్కుల నుంచే నష్టపరిహారం ఇప్పించాలని ఆ సంస్థ కోరింది. ఇక నుంచైనా ఆ స్థలంలో నిర్మించిన ఇండ్లు, ప్లాట్ల క్రయ విక్రయాలను నిలుపుదల చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నది.

Advertisement

Next Story