యూపీలో దారుణం: 4 నెల‌ల బిడ్డ‌ను చంపిన కోతి మూక‌

by Sumithra |
యూపీలో దారుణం: 4 నెల‌ల బిడ్డ‌ను చంపిన కోతి మూక‌
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా, డంకా గ్రామంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ముక్కు ప‌చ్చ‌లార‌ని నాలుగు నెలల పసికందును కోతులు పొట్ట‌న‌పెట్టుకున్నాయి. కోతుల గుంపు ఆ చిన్న‌బిడ్డ‌ను పట్టుకుని వెళ్లి, మూడు అంతస్తుల భవనంపై నుండి విసిరేశాయి. స్థానికి నివేదికల‌ ప్రకారం, త‌ల్లిదండ్రుల‌ శిశువుతో పాటు డాబాపై ఉన్న స‌మ‌యంలో అక్క‌డ పేరుమోసిన ఓ కోతుల గుంపు పైకప్పుపై నుండి దిగి తల్లిదండ్రులపై దాడి చేసింది. ఆ స‌మ‌యంలో తండ్రి నిర్దేశ్ ఉపాధ్యాయ్, తన భార్యతో కలిసి మెట్ల మార్గం నుండి కిందికి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అయితే, శిశువు అత‌ని చేతుల్లో నుండి జారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. కోతుల మూక‌ ఆ అవకాశాన్ని చేజిక్కించుకుని బిడ్డ‌ను లాక్కొని, అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

హ‌ఠాత్ప‌రిణామానికి షాకైన‌ తండ్రి, తన బిడ్డను తీసుకెళ్తున్న కోతి మూక కేసి ప‌రిగెడుతూ, సహాయం కోసం గట్టిగా అరిచాడు. ఇత‌ర కుటుంబ స‌భ్యులు అర్థం చేసుకుని సహాయం కోసం పరుగెత్తేలోపే, శిశువును టెర్రస్ నుండి కిందికి విసిరేశాయి. వైద్యుల రిపోర్ట్‌ ప్రకారం, శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రితో పాటు మరో కుటుంబ సభ్యుడు కూడా కోతుల దాడికి గురైనట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. త్వ‌ర‌లో ఆ చిన్న బిడ్డ‌కు పేరు పెట్టే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని కుటుంబం సిద్ధప‌డుతున్న త‌రుణంలో ఈ హృదయ విదారక సంఘటన ఆ ప్రాంతవాసుల‌ను విచారంలో ముంచింది. బరేలీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, లలిత్ వర్మ ఈ దుర్ఘటన గురించి తెలియజేసారు. వెంటనే అటవీ శాఖ బృందాన్ని పంపి విచారణ జరిపి, సాధారణ ప్ర‌జ‌ల జీవితాల్లో విధ్వంసం సృష్టించిన ఆ కోతి మూక‌ను పట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

Next Story