ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అవి కనిపించడం లేదా..? ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్

by Satheesh |   ( Updated:2022-07-11 14:48:43.0  )
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అవి కనిపించడం లేదా..? ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్
X

దిశ, జగిత్యాల: రైతుని రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలే అందుకు నిదర్శనమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు కొరకు రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని అన్నారు. సాగు నీటితో పాటు తాగునీరు, నాణ్యమైన కరెంట్ అందిస్తున్న విషయాన్నీ ప్రతిపక్ష నాయకులు గమనించాలని సూచించారు. వ్యవసాయ శాఖ పనితీరుపై జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.. రైతుల కోసం తెలంగాణా ప్రభుత్వం కేవలం రైతు బంధు మాత్రమే అమలు చేస్తుందని జీవన్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్దరణ, వ్యవసాయ మార్కెట్‌ల ఆధునీకరణ, గోదాంల నిర్మాణాలు వంటి సంక్షేమ పథకాలుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వాలు హయాంలో పండిన పంట ఎంత..? తెలంగాణా వచ్చాక పండిన పంట ఎంత..? అప్పటి ప్రభుత్వం కొన్నది ఎంత..? నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటున్న ధాన్యం ఎంతో తెలుసుకొని మాట్లాడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు జరిగితే దానిని మంత్రి ఈశ్వర్‌కు ఆపాదించడం సరికాదన్నారు. నియోజకవర్గంలోని 172చెరువుల్లో ఎన్ని చెరువులు ఎండి పోయాయో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. స్వయంగా రైతు అయిన జీవన్ రెడ్డి రాజకీయాల కోసం రైతులను తప్పుదోవ పట్టించడం విచారకరమని అన్నారు. ఈ సమావేశంలో రాయికల్ జెడ్పీటీసీ అశ్విని, ఏఎంసీ చైర్మన్ గన్నెరాజిరెడ్డి, పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు రమణ, రాయికల్ మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు నాయకులు రవి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story