బౌన్సర్.. టెర్రర్! వివాదాస్పదంగా మారిన ప్రైవేట్ సెక్యూరిటీ

by Bhoopathi Nagaiah |
బౌన్సర్.. టెర్రర్! వివాదాస్పదంగా మారిన ప్రైవేట్ సెక్యూరిటీ
X

‘బౌన్సర్’ ఇప్పుడు ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు కుటుంబంలో జరిగిన గొడవల్లో బౌన్సర్ల హంగామా ఎక్కువగానే కనిపించింది. సంధ్య ధియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో కూడా బౌన్సర్ల ప్రవర్తన ఓ పెద్ద అలజడి సృష్టించింది. ఇవి రెండే కాక గతంలోనూ బౌన్సర్ల తీరుపై చాలా వివాదాలు తలెత్తాయి. పోలీసులు వార్నింగులు ఇస్తున్నా.. బౌన్సర్ల వ్యవహారశైలిలో పెద్దగా మార్పు రావడంలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు బౌన్సర్ల ఆవేదన వేరుగా ఉన్నది. వీఐపీ దగ్గరికి ఎవరిని రాకుండా చూడటమే తమ బాధ్యత అని.. ఈ వ్యవహారంలో చోటు చేసుకునే సంఘటనలు మమ్మల్ని దోషుల్ని చేస్తున్నాయని వాపోతున్నారు. -గొట్టిముక్కుల సుధాకర్ గౌడ్

బౌన్సర్ అంటే...

క్రౌడ్ కంట్రోలింగ్ మ్యాన్ ఫోర్స్‌ను బౌన్సర్ గా అంటారు. ఈవెంట్, క్రికెట్ మ్యాచ్, భారీ సమావేశం, సభ, ర్యాలీ వంటి భారీ సమూహాలతో కూడిన కార్యక్రమాలతోపాటు పబ్‌లు, నైట్ క్లబ్స్, క్యాసినో, వంటి ప్రాంతాలతో పాటు, సెలబ్రిటీలు, వీఐపీలు, పొలిటీషియన్లకు రక్షణ వలయంగా ఉంటూ సమూహాన్ని కంట్రోల్ చేస్తారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో తోపులాట జరగకుండా చూడటం.. ఇబ్బందికరమైన పరిస్థితులనుంచి రక్షణకు బౌన్సర్లను ప్రత్యేకంగా నియమించుకుంటారు.

స్టేటస్ సింబల్‌..

బౌన్సర్లు వెంట ఉండటాన్ని కొంతమంది స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. చాలామంది వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నాయకులు ఇంకా చాలా మంది వారి పొజిషన్ ను చూపించుకునే క్రమంలో ఈ బౌన్సర్ లను వెంట పెట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. వివాహ వేడుకల్లో కూడా ఈ మధ్య బౌన్సర్ల హంగామా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నది. మొత్తానికి బౌన్సర్లు ఉన్నారంటే ఆ లుక్కే వేరని సొసైటీల్లో తమను ఓ పెద్ద సెలబ్రిటీ గా భావిస్తారని అనుకునేవాళ్లకు కొదవేలేదు.

బ్లాక్ అండ్ బ్లాక్

బ్లాక్ డ్రస్సు, సఫారీ దుస్తుల్లోనే బౌన్సర్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు. కానీ, చాలా ఏండ్లుగా బౌన్సర్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్, సఫారీ వేసుకోవడం ట్రేడ్ మార్క్‌గా మారింది. ఈ వ్యవస్థ మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎప్పటినుంచో ఉన్నది. ఆయా దేశాల్లో కూడా బౌన్సర్ల డ్రస్సు బ్లాక్ లో ఉండాలనే పద్ధతి చలామణీలో ఉంది. నిజానికి అన్ని రంగుల్లో కన్నా బ్లాక్ అతి తొందరగా ఆకర్షిస్తుంది. అదే విధంగా బౌన్సర్ల శరీర ధారుడ్యానికి తోడుగా ఈ బ్లాక్ డ్రస్సు ధరించడంతో వారిలో మరింత గాంభీర్యం పెంచి.. ఎదుటివారిని సెలబ్రిటీల చెంతకు రాకుండానే నియంత్రిస్తుందనే బౌన్సర్ల ఏజెన్సీలు విశ్వసిస్తాయి. బౌన్సర్లను అమెరికాలో కూలర్, లండన్‌లో డోర్ సూపర్ వైజర్ అని పిలుస్తారు. దీంతోపాటు బౌన్సర్‌గా ఉద్యోగం పొందాలంటే మంచి హైట్‌తో భారీకాయం ఉండాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామంతో శరీర ధారుడ్యాన్ని పెంచుకుని ఉండాలి. గంటల తరబడి విధుల్లో నిలబడే శక్తి ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్న వారికే బౌన్సర్ లు గా నియమించుకుంటారు. బౌన్సర్ వృత్తిని ఎంచుకునేందుకు యువతే అధికంగా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది యువత వారి శరీరాన్ని సరైన ఆక‌ృతిలో తీర్చిదిద్దుకునేందుకు అధిక వ్యాయామంతోపాటు, పౌష్ఠికాహారాన్ని తీసుకుంటారు. అయితే, 18-35 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వారినే సెక్యురిటీ ఏజెన్సీలు ఎంపిక చేసుకుంటాయి.


PSARA లైసెన్స్

బౌన్సర్ల నియామకానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు లేవు. కానీ, సెక్యూరిటీ ఏజెన్సీ ప్రారంభించాలంటే కచ్చితంగా PSARA లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ ఉంటేనే సెక్యూరిటీ ఏజెన్సీ ప్రభుత్వ ఆమోదం ఉంటుంది కాబట్టి అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ముందుగా ఈ లైసెన్స్ తీసుకుంటాయి. ప్రభుత్వ లైసెన్స్ ఉన్న సంస్థలే బౌన్సర్లను నియమించుకుంటాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వీరిని సెక్యూరిటీ గార్డ్స్ కింద ఎంపిక చేసుకుని వారిని బౌన్సర్లుగా ఈవెంట్లు, వివిధ కార్యక్రమాలను నిర్వహించే సెలబ్రిటీలు, వీఐపీల కోసం పంపిస్తుంటాయి. రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ పొందిన సెక్యురిటీ గార్డుల లైసెన్స్ ఐదేండ్ల వరకు ఉంటుంది. ఈ యాక్ట్ లోనే సెక్యూరిటీ గార్డుల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించాల్సిన సదుపాయాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ వారి దగ్గర పని చేసే గార్డ్స్ పూర్తి సమాచారం, ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. రిటైర్డ్ పోలీసు, ఎక్స్ సర్వీసుమెన్ లను నియమించుకునే సందర్భంలో వారి గన్ లైసెన్స్ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ లైసెన్స్ పొందిన ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డులకు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. సెక్యూరిటీ గార్డులకు సంబంధించి.. పూర్తి నిబంధనలు, విధివిధానాలు ఉన్నప్పటికీ.. బౌన్సర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. తాజా వివాదాల నేపథ్యంలో బౌన్సర్లకు కూడా నియమనిబంధనలు, విధులపై మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

యువతకు ఉపాధి

పార్ట్ టైం ఉద్యోగం కింద డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చాలా మంది యువత బౌన్సర్లుగా పని చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పబ్‌లు, రెస్టారెంట్లు, ఇక రాత్రి పూట జరిగే ఈవెంట్ల వద్ద బౌన్సర్లుగా పని చేస్తున్నారు. కనీసం ఐదు నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తే ఏజెన్సీ నుంచి ఒక బౌన్సర్ కు రూ.1300 నుంచి రూ.1500 వస్తాయి. ఇక పబ్ లవద్ద పని చేయాలంటే ప్రారంభంలో నెలకు రూ.20 వేలనుంచి రూ.25 వేల చెల్లిస్తారు. ఇక ఇతర రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్‌కు అయితే ఐదారు గంటలు పని చేస్తే ఏజెన్సీలు రూ.2500 నుంచి రూ.5000 వరకు చెల్లిస్తున్నాయి. ఇలా ఒక హైదరాబాద్ లోనే దాదాపు 25 పైగా ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీల్లో మూడు వేల మంది బౌన్సర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో కొందరు పర్మినెంట్‌గా ఇదే ప్రొఫెషన్‌ను ఎంచుకోగా మరికొంతమంది పార్ట్ టైం గా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.

మహిళ బౌన్సర్ లకు ఫుల్ డిమాండ్

తాజాగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో మహిళ బౌన్సర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా మహిళ సెలబ్రిటీలు వారికి రక్షణగా పురుష బౌన్సర్లకన్నా మహిళ బౌన్సర్లను ఎంగేజ్ చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. దీంతో ఇప్పుడు మహిళ బౌన్సర్ల డ్యూటీకి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇప్పుడు దాదాపు 1000 మంది మహిళ బౌన్సర్లు వివిధ ఏజెన్సీల ద్వారా విధులను నిర్వహిస్తున్నారు.

బోనస్‌గా బూతులు

బౌన్సర్‌గా విధులు నిర్వహించడం ఎంతో కష్టంతో కూడుకున్నదని పలువురు బౌన్సర్లు వాపోతున్నారు. ’మా విధి మిమ్మల్ని నియమించుకున్న వ్యక్తి, కార్యక్రమం నిర్వాహకులకు రక్షణ, భద్రత కల్పించడం.. అంతే తప్ప మాకు ఎవరితో కక్షలు ఉండవు. సినీ సెలబ్రిటీలు, వీఐపీలను చూడగానే చాలా మంది అభిమానులు వారికి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారితో సెల్ఫీలు దిగాలని పోటీ పడతారు. ఈ సంతోషంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియదు. ఫలితంగా ఆ సెలబ్రిటీకి ఇబ్బంది కలగొచ్చు.. గాయాలు కూడా కావచ్చు. ఆ పరిస్థితి కలుగకుండా మేము వారికి ఒక రక్షణ కవచంగా మారుతాం. మేము ఎవరీ మీద దాడి చేయం. పబ్బులు, ఇంకా కొన్ని ఈవెంట్స్‌లో మా ఇంట్లో వారి పేర్లను తీసి మరి బూతులు తిడతారు. వారిని కంట్రోల్ చేసే క్రమంలో మేము చాలా ధృడంగా వ్యవహరించాల్సి వస్తుంది. అయినా, ఎప్పుడు పరిమితి దాటం. సెలబ్రిటీలు కూడా వారి అభిమానులు, ప్రేక్షకులు, కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించొద్దని చెబుతారు. అదేసమయంలో మా మీద పడకుండా చూడాలని కోరుతారు. ఈ నేపథ్యంలోనే మేము సెలబ్రిటీల రక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం. కానీ, కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీల రక్షణ సందర్భంలో తప్పులు దొర్లి అవి వివాదాస్పదంగా మారిపోయాతుంటాయి’ అని బౌన్సర్లు అంటున్నారు.

త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలు

సంధ్య ధియేటర్ తొక్కిసలాట సంఘటన, మోహన్ బాబు కుటుంబాల గొడవల నేపథ్యంలో బౌన్సర్ల వ్యవహారం, ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అతి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని బౌన్సర్లను పంపించే ఏజెన్సీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ను పోలీసు బాసులు ఇచ్చారు. అతి త్వరలోనే బౌన్సర్ల డ్యూటీ పై ప్రత్యేక మార్గదర్శకాలు తెస్తామన్నారు.

18 ఏండ్లుగా బౌన్సర్ సేవలు

హైదరాబాద్‌లో దాదాపు 54 పబ్బులు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్బులకు రక్షణగా బౌన్సర్ల సేవలను అందిస్తున్నాను. ఐపీఎస్, ప్రో కబడ్డీ, లైవ్ ఈవెంట్స్, సన్ బర్న్ ఫెస్టివెల్స్, ముంబాయి, బెంగళూరు, వైజాగ్, పుణె, ఇండోర్ జరిగే కార్యక్రమాలకు కూడా బౌన్సర్లను పంపిస్తున్నాను. పోలీసుల సహకారంతో మేము చాలా కార్యక్రమాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పని చేశాం. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు బౌన్సర్లకు చాలా డిమాండ్ ఉంది. మహిళలు కూడా బౌన్సర్లుగా పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మా సేవలను కార్పొరేట్ కంపెనీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. బౌన్సర్లకు చెప్పేది ఒక్కటే ఓపికగా ఉండాలి.. దానిని ఏ క్షణంలోనూ తప్పొద్దని చెప్తాం. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు అలాంటి సమయాల్లోనే మా వ్యవహారం వివాదస్పదం అవుతుంది.

- సాధన్ నాయుడు, స్వాట్ సెక్యురిటీ ఏజెన్సీ, హైదరాబాద్

Advertisement

Next Story

Most Viewed