'ఆ పరిస్థితి వస్తే చర్యలు తప్పవు'.. నిమ్స్ నర్సులకు మంత్రి హరీష్ రావు కీలక ఆదేశం

by Satheesh |
ఆ పరిస్థితి వస్తే చర్యలు తప్పవు.. నిమ్స్ నర్సులకు మంత్రి హరీష్ రావు కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న నర్సులు తక్షణమే నిరసనలు విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, కార్మిక శాఖ కమిషనర్‌తో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. నర్సుల ఆందోళపై చర్చించారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు నర్సులతో సమానంగా 30 శాతం వేతనం పెంపు, పే స్లిప్స్, వెయిటేజీ, ఎరియర్స్, రెగ్యులర్ రిక్రూట్మెంట్‌లో అవకాశం ఇప్పటికే కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టు నర్స్‌లకు ఎటువంటి మెటర్నిటీ లీవ్ బెనిఫిట్ ఉంటుందో దానినే నిమ్స్ కాంట్రాక్టు నర్స్‌లకు వర్తింప చేశామన్నారు.

కానీ నర్సులు మాట మార్చి రెగ్యులరైజ్ చేయాలని, ఇంకా వేతనం పెంచాలని మొండికేసి ఆందోళనలో పాల్గొనడం సరైన విధానం కాదన్నారు. నిమ్స్‌లోని నర్స్‌లను 2010లో స్టూడెంట్ ఇంటర్న్ లుగా తీసుకున్నోళ్లకు అప్పట్లో కేవలం రూ. 8 వేలు మాత్రమే ఇచ్చేవారని, కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8వేల నుండి నాలుగు రెట్లు పెంచి 32వేలు చేశామన్నారు. సర్వీస్‌ను స్టాఫ్ నర్స్ కాంట్రాక్టుగా గుర్తించి రెగ్యులర్ నియామకాలలో వెయిటేజీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. దీని ద్వారా 80 మందికి రెగ్యులర్ పద్దతిలో ఉద్యోగం పొందడం జరిగిందన్నారు. ఇప్పుడున్న వారిని కూడా దశల వారీగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. చాల మంది రెగ్యులర్ జాబ్‌లు లేదా ఇతర అవకాశం వచ్చిన తరువాత వదిలి వెళ్లిపోయినట్లు చెప్పారు. అన్ని డిమాండ్ లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన తర్వాత కూడా ఇంకా ఆందోళనలో పాల్గొని పేషెంట్ సేవలకు అంతరాయం కల్పించడం మంచిది కాదన్నారు.

ఎలాంటి పరీక్ష లేకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా, ఆరు నెలల కాలానికి విధుల్లో చేరిన నర్సులు రెగ్యులరైజ్ చేయాలని కోరడం నిబంధనలకు లోబడి లేదని తేల్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఆందోళన విరమించాలని కోరుతున్నప్పటికీ నర్సులు లెక్క చేయడం లేదని వివరించారు. రోగులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నొక్కి చెప్పారు. నర్స్‌ల విద్య కొరకు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజి అనుబంధంగా నర్సింగ్ కాలేజి కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నర్సింగ్ విద్యార్థులకు దేశంలోనే ఎక్కడ లేనివిధంగా ముందు ఉన్న 1,500 స్టైపెండ్‌ను మొదటి సంవత్సరం నుండి నాల్గవ సంవత్సరం వరకు 5వేలు, 6 వేలు, 7 వేలు మరియు 8వేలకు పెంచామన్నారు.

Advertisement

Next Story

Most Viewed