BJP కి కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి హరీశ్ రావు

by GSrikanth |   ( Updated:2022-04-01 09:34:36.0  )
BJP కి కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి హరీశ్ రావు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: BJP అంటే భారతీయ జూటా పార్టీ అని, ఆ పార్టీ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనతో దేశంలో విద్యుత్​సంక్షోభం నెలకొన్నప్పటికీ.. సీఎం కేసీఆర్​పాలనలో తెలంగాణలో నిరంతర వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు, ఇతర యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్, పరిశ్రమలు, ఇతర అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా కోసం రూ.20 యూనిట్​చొప్పున ఖర్చుపెట్టి ఒక్క మార్చి నెలలోనే రూ.1200 కోట్ల విద్యుత్​కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 17,305 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఏడాదిలోగా యాదాద్రి, ఆరునెలల్లో ఎన్టీపీసీ విద్యుత్​ ప్రాజెక్టులు పూర్తకానున్నాయని దీనితో మరో 5600 మెగావాట్ల విద్యుత్​ అదనంగా ఉత్పత్తి కానున్నదని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్​సహా​తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరాఖాండ్, పంజాబ్‌లో కరెంట్​కోతలు కొనసాగుతున్నాయని తెలిపారు. గుజరాత్‌లో వారంలో ఒకరోజు పరిశ్రమలకు పవర్​హాలీడే ప్రకటించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా 6 నుంచి 8 గంటల విద్యుత్​కోతలు విధిస్తున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణలో మాత్రం పరిశ్రమలకు 24 గంటల కరెంట్ సరఫరా అవుతున్నదని, దీనితో కార్మికులు ఓటీలు చేసుకుని సంతోషంగా ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్​కోతలతో పటాన్​చెరు ప్రాంతంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. దేశంలో విద్యుత్ సంక్షోభంపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక్క మంచి పనిచేయడం లేదని విమర్శించారు. యూపీఏ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్​ధరను వెయ్యికి పెంచారు, 8.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్‌ను 8.1 శాతానికి తగ్గించారు. గడచిన 11 రోజుల్లో 9 రోజులు పెట్రోల్​ధర పెంచి రూ.110 దాటించారని మండిపడ్డారు. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ బీజేపీకి ముందు చూపులేకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశంలో 2 లక్షల మెగావాట్ల డిమాండ్​ఉండే ఉత్పత్తి సామర్థ్యం 3.95లక్షల మెగావాట్ల వరకు ఉన్నదని వెల్లడించారు.

దళిత బంధుతో పేద కుటుంబాల్లో వెలుగులు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. పటాన్​చెరు నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. నేరుగా రూ.10 లక్షలకు ఓ పేద కుటుంబానికి అందిస్తున్న ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. గతంలో దళితులకు రుణాలు ఇస్తే ఆస్తులు తాకట్టు పెట్టుకునేవారని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి తిరిగి చెల్లించకుండా పూర్తిగా గ్రాంట్​కింద అందిస్తున్నట్లు వెల్లడించారు. మొదటగా దళితులకు అందిస్తున్నామని, విడతల వారీగా ఇతరులకు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. దళితుల సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రోల్​మోడల్​అని అన్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి రాష్ట్రంలో విడతల వారిగా 2 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి, కలెక్టర్​హనుమంతరావు, కార్పొరేటర్లు సిందూ ఆదర్శరెడ్డి, పుష్పా నగేష్​యాదవ్, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed