మెడికల్ కాలేజ్ తరలింపు అబద్ధం: మంత్రి హరీష్ రావు

by Web Desk |
మెడికల్ కాలేజ్ తరలింపు అబద్ధం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షుడు చింత ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కొందరు సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ మంజూరైనట్లు దానిని సిద్దిపేటకు తరలించినట్లు తప్పుడు ప్రచారం చేశారని అది అబద్ధమన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ మంజూరైతే వాటికి సంబంధించిన కాగితాలు ఎందుకు చూపించడం లేదని పరోక్షంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఉద్దేశించి ఆరోపించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్ కాలేజీని మంజూరు చేశామన్నారు. దీనితో పాటు అదనంగా నర్సింగ్ కాలేజీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంగారెడ్డి లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం అవుతుందని తెలిపారు.

సంగారెడ్డి నియోజక వర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు..

సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా సంగారెడ్డి నియోజక వర్గానికి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సొంత భూమి ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..

రాష్ట్రవ్యాప్తంగా సొంత భూములు ఉండి ఇల్లు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ను కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి , సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగులో విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, కంది జెడ్పిటిసి కొండల్ రెడ్డి ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story