టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి "మంత్రి ఎర్రబెల్లి" సోదరుడు..?

by Mahesh |
టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు సోద‌రుడు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేర‌డం దాదాపు ఖ‌రారైంది. ఈ మేర‌కు ప్రదీప్‌రావు తుది నిర్ణయం తీసుకోగా ఈనెల 3న ఇదే విష‌యంపై ముఖ్య అనుచ‌రుల‌తో వ‌రంగ‌ల్‌లోని ఆయ‌న నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న వ్యక్తులు 'దిశ‌' పత్రికకు ధ్రువీక‌రించారు. ఈనెల 7న ప్రదీప్‌రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌నున్నారు. అనంత‌రం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స‌మ‌క్షంలో క‌మ‌లం కండువా క‌ప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి ప్రదీప్‌రావు చేరిక ఒకే రోజూ ఉంటుంద‌ని స‌మాచారం.

ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్ vs ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్‌కు అదే పార్టీలో ఉంటున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వ‌ర్గీయుల‌కు మ‌ధ్య చాలా రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం జ‌రుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఫ్లెక్సీల‌ను గుర్తు తెలియ‌ని వ్యక్తులు చించివేశారు. ఆ ఫ్లెక్సీల‌ను చించివేత వెనుక ఎమ్మెల్యే న‌రేంద‌ర్ డైరెక్షన్ ఉంద‌ని ప్రదీప్‌రావు వ‌ర్గీయులు బ‌లంగా న‌మ్ముతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రదీప్‌రావు కూడా వ‌రంగ‌ల్ తూర్పు టికెట్ ఆశిస్తుండ‌టంతో ఈ రాజ‌కీయ పోరు గ‌డిచిన కొద్దిరోజులుగా ఉధృతంగా మారింది. ప‌రిణామాల‌ను గ‌మనించిన ప్రదీప్‌రావు అధిష్ఠానం ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌కే అవ‌కాశం ఇచ్చేలా కనిపించ‌డంతో బీజేపీ ఆఫ‌ర్‌ను స్వీక‌రించిన‌ట్లుగా రాజ‌కీయ విశ్లేష‌ణ జ‌రుగుతోంది. వాస్తవానికి ప్రదీప్‌రావు బీజేపీలో చేరుతున్నట్లుగా ప‌దిహేను రోజులుగా వ‌రంగ‌ల్ ముఖ్యరాజ‌కీయ వేత్తల మ‌ధ్య గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ గుస‌గుస‌ల‌ను నిజం చేస్తూ ఈనెల 7న స్పష్టమైన ప్రక‌ట‌న రానుంద‌ని ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఒక‌రు దిశ‌కు వెల్లడించారు.

పార్టీ‌లో గుర్తింపు కరువు..

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే టికెట్ అవ‌కాశం కోసం ఆశించి.. రెండు ప‌ర్యాయాలు భంగ‌పాటు జ‌ర‌గ‌డంతో పాటు మూడోసారి కూడా అవ‌కాశం ద‌క్కద‌నే ఆలోచ‌న‌తో ప్రదీప్‌రావు పార్టీని వీడేందుకు సిద్ధమైన‌ట్లుగా తెలుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు నుంచి పీఆర్పీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అతి త‌క్కువ ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సార‌య్య చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రదీప్‌రావు 2014లో ఆ పార్టీ నుంచి వ‌రంగ‌ల్ తూర్పు టికెట్ ఆశించారు. అయితే కొండా సురేఖ‌కు ద‌క్కడంతో.. నామినేష‌న్ వేసి కేసీఆర్ సూచ‌న‌తో విత్‌డ్రా చేసుకున్నారు. 2018 ఎన్నిక‌ల్లో కూడా నామినేష‌న్ వేసి అధిష్ఠానం సూచ‌న‌తో విత్‌డ్రా చేసుకున్నారు. త‌న‌కు కాకుండా ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌కు గాని, ఎమ్మెల్సీ సార‌య్యకు గాని, వ‌ద్దిరాజు ర‌విచంద్రకు గాని టికెట్ అవ‌కాశం క‌ల్పించేట్లుగా ప‌రిస్థితులున్నాయ‌నే స‌మాచారంతోనే ఆయ‌న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రదీప్ రావు చేరికతో తూర్పున బీజేపీ బ‌ల‌ప‌డిన‌ట్లే..!

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో స్పష్టమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్న బీజేపీకి ప్రదీప్‌రావు చేరిక మరింత బ‌ల‌మ‌వుతుంద‌న్నది వాస్తవం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయ‌కులు గంటా ర‌వికుమార్ ఆక్టివ్ రోల్‌తో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీని రెండోస్థానానికి చేర్చార‌ని రాజకీయ వర్గాల్లో జోరు చర్చ జ‌రుగుతోంది. తాజాగా ప్రదీప్‌రావు చేరిక ఆ పార్టీకి మ‌రింత‌గా బ‌లాన్ని పెంచుతుంద‌ని.. గెలుపుకు ఆ పార్టీ మ‌రింత ద‌గ్గర‌వుతుంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. అయితే పార్టీ నుంచి టికెట్‌ను ఆశిస్తున్న గంటార‌వికుమార్‌తో పాటు మ‌రో ఇద్దరితో పాటు తాజాగా ప్రదీప్‌రావు ఆ జాబితాలో చేరిపోనున్నారు. పార్టీ టికెట్‌పై స్పష్టమైన హామీతోనే ప్రదీప్‌రావు క‌మ‌ల‌ద‌ళంలో చేరుతున్నట్లుగా ఆయ‌నకు అత్యంత స‌న్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గంటా ర‌వికుమార్‌తో పాటు టికెట్ ఆశిస్తున్న ఇత‌ర బీజేపీ నేత‌లు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story